అంగన్వాడీ గుడ్లలో నాణ్యత డొల్ల!
ఉడికించిన తర్వాత బయటపడిన అసహజ రంగు..
చిన్నారులకు అందించే ఆహారంపై ఆందోళన
గాంధీనగర్ కేంద్రంలో మరో నిర్లక్ష్యం..
11 గంటలు దాటినా తెరుచుకోని తలుపులు
బూర్గంపాడు,(విజయక్రాంతి): చిన్నారులకు పౌష్టికాహారం అందించాల్సిన అంగన్వాడీ కేంద్రాల్లో నాణ్యతా ప్రమాణాలు గాలికొదిలేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బూర్గంపాడు మండలంలోని గాంధీనగర్ అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు అందించే కోడిగుడ్లను(Anganwadi Eggs Unfit) ఉడికించిన అనంతరం పరిశీలించగా, కొన్ని గుడ్లలో అసహజమైన రంగు, నల్లటి మచ్చలు కనిపించాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి.
ప్రభుత్వం చిన్నారుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అంగన్వాడీల ద్వారా పౌష్టికాహారం అందిస్తున్నప్పటికీ, ఇలాంటి నాణ్యతలేని గుడ్లు సరఫరా అవుతున్నాయనే ఆరోపణలు ఆందోళన కలిగిస్తున్నాయి. గుడ్లు సరఫరా చేసే సమయంలో నాణ్యతను పరిశీలిస్తున్నారా? నిల్వ చేసే విధానంపై పర్యవేక్షణ ఉందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.మరోవైపు ఉదయం 9 గంటలకే తెరవాల్సిన కేంద్రం సోమవారం ఉదయం 11 గంటలు దాటినా తాళం వేసి ఉందని స్థానికులు చెబుతున్నారు. నిర్ణీత సమయానికి కేంద్రం తెరవకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.
అధికారుల తనిఖీలు ఏవీ?
చిన్నారులకు అందించే ఆహార పదార్థాల నాణ్యతను సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీ చేయాల్సి ఉంది. గాంధీనగర్ అంగన్వాడీ కేంద్రంలో కనిపించిన గుడ్లపై విచారణ జరిపి, వాటి నాణ్యతను నిర్ధారించాలని స్థానికులు కోరుతున్నారు. కేంద్రం పనితీరు, సిబ్బంది హాజరు, ఆహార సరఫరాపై ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.