రాహుల్‌తో మహేశ్ గౌడ్ భేటీ
హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Senior Congress Leader Rahul Gandhi) త్వరలో హైదరాబాద్‌కు రానున్నారా? భారత్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు ఆయన పర్యటనపై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్(TPCC President Mahesh Kumar Goud) ఢిల్లీలో రాహుల్ గాంధీతో సమావేశమై హైదరాబాద్‌లో జరిగే భారత్ సమ్మిట్‌కు ఆహ్వానించారు. ఈ భేటీలో ఓబీసీల రాజకీయ ప్రాతినిధ్యం, తెలంగాణలో పార్టీ పరిస్థితులు, కాంగ్రెస్ సంస్థాగత కార్యక్రమాలపై చర్చించారు.
దేశవ్యాప్తంగా, ముఖ్యంగా తెలంగాణలో వెనుకబడిన వర్గాలకు రాజకీయంగా మరింత ప్రాధాన్యత కల్పించాల్సిన అవసరాన్ని రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లినట్లు మహేశ్ కుమార్ గౌడ్ వెల్లడించారు. పార్టీ చేపడుతున్న సంస్థాగత కార్యక్రమాలు, రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిణామాల గురించి వివరించినట్లు తెలిపారు.
భారత్ సమ్మిట్(Bharat Summit) సందర్భంగా గిగ్ వర్కర్ల(Gig Workers)తో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించాలని రాహుల్ గాంధీ సూచించినట్లు మహేశ్ గౌడ్ తెలిపారు. ఈ సమావేశంలో గిగ్ వర్కర్ల సమస్యలు, వారి సంక్షేమ అంశాలపై చర్చించే అవకాశం ఉంది. వారిని ఉద్దేశించి రాహుల్ ప్రసంగించే అవకాశముందని కూడా వెల్లడించారు.
తెలంగాణలో నిర్వహించనున్న మెగా బీసీ ర్యాలీకి కూడా రాహుల్ గాంధీని ఆహ్వానించినట్లు టీపీసీసీ చీఫ్ చెప్పారు. నవంబర్ చివరి నాటికి రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేస్తామని వెల్లడించారు. సోనియా గాంధీ ఆత్మకథ పుస్తకంపై తెలంగాణలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.
నవంబర్ 12,13,14 వరకు హైదరాబాద్‌లో జరగనున్న భారత్ సమ్మిట్‌కు వివిధ దేశాల నుంచి ప్రతినిధులు హాజరుకానున్నారు. ప్రజాస్వామ్యం, అంతర్జాతీయ సంబంధాలు, ప్రపంచ రాజకీయ పరిణామాలు తదితర అంశాలపై చర్చలు జరగనున్నాయి. ఈ అంతర్జాతీయ సదస్సు హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తుందని కాంగ్రెస్ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.