భూ యజమానులకు గుడ్న్యూస్
హైదరాబాద్: తెలంగాణలో భూముల సమగ్ర రీసర్వే ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. ఇప్పటికే వెయ్యి గ్రామాల్లో సర్వే మైలురాయిని అధిగమించినట్లు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. రైతులకు స్పష్టమైన భూ హక్కులు, భూముల హద్దుల నిర్ధారణే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని అధికారులకు సూచించారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో రెవెన్యూ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రీసర్వే పురోగతిని పరిశీలించారు. భూ రికార్డుల ఆధారంగానే రీసర్వే ప్రక్రియను ప్రారంభించాలని మంత్రి స్పష్టం చేశారు. సర్వే పూర్తయిన తర్వాత సంబంధిత భూ యజమానులకు నోటీసులు అందించాలని ఆదేశించారు. అభ్యంతరాలు ఉంటే తెలియజేసేందుకు తగిన అవకాశం కల్పించాలని సూచించారు.
సర్వే విధానం, అభ్యంతరాల నమోదు, వాటి పరిష్కారంపై రైతులకు అధికారులు స్పష్టంగా వివరించాలని పొంగులేటి సూచించారు. ప్రతి భూ యజమానికి తన భూమిపై హక్కులు, ఖచ్చితమైన హద్దులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. తరతరాలుగా పెండింగ్లో ఉన్న భూ వివాదాలకు పరిష్కారం చూపేలా రీసర్వే ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.