వైసీపీకి మరో షాక్.. సీనియర్ నేత గుడ్‌బై!
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత అన్నపరెడ్డి విజయభాస్కర్ రెడ్డి(Annapareddy Vijayabhaskar Reddy) రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా వైసీపీ(YCP) నాయకత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. పార్టీలో అంతర్గత వ్యవహారాలు సరిగా లేవని ఆరోపిస్తూ అసంతృప్తి వ్యక్తం చేశారు.
వైసీపీలో ఎవరికీ సరైన ప్రాథమిక సభ్యత్వాలు లేవని విజయభాస్కర్ రెడ్డి ఆరోపించారు. సంతకాలు లేని లెటర్ ప్యాడ్లపై పార్టీ పదవులు కేటాయిస్తున్నారని విమర్శించారు. పార్టీ నిర్వహణ, పదవుల పంపిణీ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపైనా ఆయన విమర్శలు గుప్పించారు. ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని జగన్ వమ్ము చేశారని వ్యాఖ్యానించారు. పార్టీ ప్రస్తుత పరిస్థితులే తన రాజీనామా నిర్ణయానికి కారణమని వెల్లడించారు.
మరోవైపు మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి కొత్తగా ఏర్పాటు చేయబోయే పార్టీలో చేరనున్నట్లు విజయభాస్కర్ రెడ్డి ప్రకటించారు. దీంతో ఆయన తదుపరి రాజకీయ అడుగులపై ఆసక్తి నెలకొంది. అన్నపరెడ్డి విజయభాస్కర్ రెడ్డి రాజీనామా ప్రకటన వైసీపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.