105 వసంతాలు పూర్తి చేసుకున్న మండల లక్ష్మి

10-11-2026 | 09:15pm

కుటుంబ సభ్యుల మధ్య అంబరాన్నంటిన జన్మదిన వేడుకలు

రేగొండ, నవంబర్ 10 (విజయ క్రాంతి): వందేళ్లు దాటిన జీవిత ప్రయాణంలో ఎన్నో అనుభవాలు, మరెన్నో మధురానుభూతులను సొంతం చేసుకున్న కనిపర్తి గ్రామానికి చెందిన మండల లక్ష్మి(Mandala Lakshmi) 105వ జన్మదిన వేడుకలు(Birthday celebrations) కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా జరిగాయి. కొడుకులు, కోడళ్లు, మనుమలు, మనుమరాళ్లు ఒకచోట చేరి ఆమె జన్మదినాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించారు.

కుమారులు మండల మురళి స్వామి, మండల వీరస్వామి ఆధ్వర్యంలో, మనుమడు మండల సాంబమూర్తి ప్రత్యేక పర్యవేక్షణలో కొడవటం లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం సన్నిధిలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మండల లక్ష్మి కేక్ కట్ చేయగా కుటుంబ సభ్యులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. పెద్దలకు నమస్కరించి ఆశీర్వాదాలు తీసుకున్నారు.

తల్లి 105 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఆయురారోగ్యాలతో ఉండటం తమ కుటుంబానికి ఎంతో అదృష్టమని కుమారులు ఆనందం వ్యక్తం చేశారు. తల్లి ప్రేమ, ఆప్యాయతలు, ఆశీస్సులే తమ కుటుంబానికి కొండంత అండగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.

మండల లక్ష్మి మరిన్ని సంవత్సరాలు సంపూర్ణ ఆరోగ్యంతో, సుఖసంతోషాలతో జీవించాలని కుటుంబ సభ్యులు ఆకాంక్షించారు. వేడుకల్లో బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు పాల్గొని ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

మరిన్ని వార్తలు