క్లౌడ్ కిచెన్లపై ఫుడ్ సేఫ్టీ పంజా

10-11-2026 | 05:06pm

హైదరాబాద్: ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ(Online Food Delivery)కి పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో నగరంలోని క్లౌడ్ కిచెన్లపై ఆహార భద్రతా అధికారులు నిఘా పెంచారు. తెలంగాణ సేఫ్ ఫుడ్ వింగ్(TG Safe Food Wing), ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు పలు క్లౌడ్ కిచెన్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాయి. ఈ సందర్భంగా ఆహార తయారీ కేంద్రాల్లో పరిశుభ్రత, ఆహార భద్రతా ప్రమాణాలను పరిశీలించాయి. తనిఖీల్లో భాగంగా 15 బాక్సుల ఫుడ్ కలర్స్‌ను స్వాధీనం చేసుకున్నాయి.

క్లౌడ్ కిచెన్ల(Cloud Kitchen)లో ఆహార పదార్థాల తయారీ, నిల్వ, వంటగది పరిశుభ్రత తదితర అంశాలను అధికారులు పరిశీలించారు. కొన్ని కేంద్రాల్లో అపరిశుభ్ర వాతావరణం, ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘనలు ఉన్నట్లు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు భావించిన ఫుడ్ కలర్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.

తనిఖీల్లో లోపాలు గుర్తించిన కొన్ని క్లౌడ్ కిచెన్ల నిర్వాహకులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మరికొన్ని కేంద్రాలకు ఇంప్రూవ్‌మెంట్ నోటీసులు అందించారు. గుర్తించిన లోపాలను సరిచేసుకుని ఆహార భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు సూచించారు.

ఇంటికే ఆహారం అందించే క్లౌడ్ కిచెన్ల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో వినియోగదారులకు నాణ్యమైన ఆహారం అందించడమే లక్ష్యంగా తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఆహార తయారీలో నిర్లక్ష్యం వహించే సంస్థలపై నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు