కల్లం రైస్ మిల్స్ కేసులో ఈడీ షాక్

10-11-2026 | 04:04pm

హైదరాబాద్: కల్లం మోడ్రన్ రైస్ మిల్స్‌(Kallam Modern Rice Mills)కు సంబంధించిన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) భారీ చర్యలు చేపట్టింది. కల్లం పేరిరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, అనుచరులకు సంబంధించిన రూ.118.33 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. బ్యాంకు రుణాల కోసం నకిలీ పత్రాలు సమర్పించడం, రుణాల నిధులను ఇతర అవసరాలకు మళ్లించడం వంటి ఆరోపణల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంది.

నకిలీ పత్రాలతో బ్యాంకు రుణాలు?

ఈడీ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఎస్‌బీహెచ్ గుంటూరులోని అరండల్‌పేట బ్రాంచ్ నుంచి సంబంధిత సంస్థలు సుమారు రూ.24.57 కోట్ల రుణం పొందాయి. ఇందుకోసం నకిలీ, ఫోర్జరీ ఆస్తి పత్రాలను ఉపయోగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. రుణాల ద్వారా పొందిన నిధులను పక్కదారి పట్టించడంతో బ్యాంకుకు రూ.18.33 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు దర్యాప్తులో గుర్తించారు.

26 సంస్థల ద్వారా లావాదేవీలు?

బంధువులు, ఉద్యోగులు, అనుచరుల పేర్లతో సుమారు 26 సంస్థలను నిర్వహించినట్లు ఈడీ పేర్కొంది. మూడు రుణగ్రహీత సంస్థల బ్యాంకు ఖాతాల నుంచి దాదాపు రూ.23.81 కోట్ల నగదు ఉపసంహరణ జరిగినట్లు గుర్తించింది. కార్మికులు, అకౌంటెంట్లు, కల్లం పేరిరెడ్డి పేర్లతో నగదు విత్‌డ్రా చేసినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు తెలిపింది.

ఏపీ, తెలంగాణలో ఆస్తుల కొనుగోళ్లు

రుణాల ద్వారా సమకూరిన నిధులతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పలు స్థిరాస్తులు కొనుగోలు చేసినట్లు ఈడీ ఆరోపించింది. అంతేకాకుండా బంధువులు, అనుచరుల పేర్లకు ఎలాంటి విక్రయ ప్రతిఫలం లేకుండానే కొన్ని ఆస్తులను బదిలీ చేసినట్లు గుర్తించింది. ఈ వ్యవహారంలో ఆస్తుల లావాదేవీలు, నిధుల మళ్లింపుపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు సమాచారం. మొత్తం రూ.118.33 కోట్ల ఆస్తులను అటాచ్ చేస్తూ ఈడీ తీసుకున్న చర్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

మరిన్ని వార్తలు