ఎమ్మెల్సీ ఓటర్ నమోదు కార్యక్రమం

25-09-2026 | 08:55pm

యువజన కాంగ్రెస్ శ్రేణులు చురుగ్గా పాల్గొనాలి

యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు జక్కిడి శివచరణ్ రెడ్డి 

సూర్యాపేట, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి): సెప్టెంబర్ నెల 28వ తేదీ నుంచి ప్రారంభం కానున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల(Graduate MLC elections) ఓటరు నమోదు కార్యక్రమంలో(Voter Registration Drive) యువజన కాంగ్రెస్ శ్రేణులు చురుగ్గా పాల్గొని అత్యధిక సంఖ్యలో పట్టభద్రుల ఓటర్లను నమోదు చేయించాలని యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు జక్కిడి శివచరణ్ రెడ్డి(Jakkidi Sivacharan Reddy)  కోరారు.

జిల్లా కేంద్రంలో యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు, మాజీ కౌన్సిలర్ ఎలిమినేటి అభినయ్ గారి అధ్యక్షతన జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశానికి యువజన కాంగ్రెస్ రాష్ట్ర సహాయ ఇన్‌చార్జ్ భవ్య తో కలిసి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ తెలంగాణలో జరగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను యువజన కాంగ్రెస్ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని సూచించారు. అర్హత కలిగిన ప్రతి పట్టభద్రుడి ఓటును నమోదు చేయించేలా క్షేత్రస్థాయిలో విస్తృతంగా పనిచేయాలని అన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వేల సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టి నియామకాలు కొనసాగిస్తోందని అన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మళ్లీ గెలిచేందుకు బీఆర్ఎస్ పార్టీ అడ్డగోలు హామీలతో పట్టభద్రులను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తోందని, అయితే పట్టభద్రులు గత పాలనను దృష్టిలో ఉంచుకుని తగిన సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ఇప్పటి నుంచే కార్యాచరణ రూపొందించుకుని ప్రతి నియోజకవర్గం, ప్రతి మండలం, ప్రతి పట్టభద్రుడి వరకు యువజన కాంగ్రెస్ శ్రేణులు చేరుకోవాలని శివచరణ్ రెడ్డి గారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ లీగల్ సెల్ చైర్మన్ గూడూరు నిఖిల్ రెడ్డి, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జిల్లా ఇంచార్జ్ వెలిమినేటి సురేష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాధవరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కొమ్ము జోహార్,  నవీన్ ఆచారి, కొత్త విద్య రెడ్డి, శ్రావ్య రెడ్డి, కందుకూరి అంబేద్కర్, నియోజకవర్గాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు