ఆలయాల్లో వరుస చోరీలు.. నిందితుల అరెస్ట్
- విగ్రహం, వెండి కిరీటం, బైక్ స్వాధీనం
సిద్దిపేట క్రైం, అక్టోబర్ 13: మర్కుక్ మండల పరిధిలో ఇటీవల ఆలయాల్లో జరిగిన వరుస దొంగతనాల కేసులను పోలీసులు ఛేదించారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి చోరీ సొత్తుతోపాటు దొంగతనాలకు ఉపయోగించిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. గజ్వేల్ రూరల్ సీఐ రవి(Gajwel Rural CI Ravi) రాజు తెలిపిన వివరాల ప్రకారం.. వర్గల్ మండలం తునికి ఖల్స గ్రామానికి చెందిన నర్సాగల్ల నాగరాజు (31), మొగుల్ల మల్లేశం (38) అనే వ్యక్తులు దొంగతనాలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది.
ఈ నెల 3న పాములపర్తి గ్రామంలోని ఎల్లమ్మ, పోచమ్మ ఆలయాల్లో, 6న గజ్వేల్ పట్టణంలోని సంతోషిమాత ఆలయంలో, 9న పాములపర్తి గ్రామంలోని దుర్గమ్మ ఆలయంలో దొంగతనాలు చేసినట్లు నిందితులు అంగీకరించారని సీఐ తెలిపారు.
గతంలోనూ పలు ఆలయాలు, ఏటీఎంలు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో దొంగతనాలకు పాల్పడినట్లు విచారణలో తేలిందన్నారు. నిందితుల నుంచి ఆంజనేయస్వామి ఉత్సవ విగ్రహం, వెండి కిరీటం, రోల్‌గోల్డ్ పుస్తెలతాడు, ఐదు లీటర్ల ఆయిల్ టిన్, స్ప్లెండర్ ప్లస్ ద్విచక్ర వాహనం, దొంగతనానికి ఉపయోగించిన గడ్డపారను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను రిమాండ్ నిమిత్తం న్యాయస్థానానికి తరలించారు. కేసులను త్వరితగతిన ఛేదించి నిందితులను పట్టుకున్న గజ్వేల్ రూరల్ సీఐ రవిరాజు, మర్కుక్ ఎస్‌ఐ యూనుస్ అహ్మద్ అలీని పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ అభినందించారు.