రెండు నెలల క్రితమే పెళ్లి.. అంతలోనే
కిడ్నీ స్టోన్ చికిత్సకు చేరి.. పది రోజులకే యువ న్యాయవాది మృతి!
హైదరాబాద్: కిడ్నీలో రాళ్ల సమస్యతో ఆస్పత్రిలో చేరిన 26 ఏళ్ల యువ న్యాయవాది ఐశ్వర్య మృతి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. మల్కాజ్‌గిరి ప్రశాంత్ నగర్‌కు చెందిన ఆమె ఈ నెల 6న సికింద్రాబాద్‌లోని కిడ్నీ సమస్యతో మెడికవర్ ఆస్పత్రిలో చికిత్స కోసం చేరినట్లు సమాచారం.
వారం రోజుల చికిత్స అనంతరం ఐశ్వర్య మెదడు తీవ్రంగా దెబ్బతిన్నట్లు వైద్యులు తెలిపారని కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు. ఆస్పత్రి యాజమాన్యం చికిత్స కొనసాగించలేమని చెప్పిందని వారు ఆరోపిస్తున్నారు. ఆసుపత్రి బిల్లు వివాదం(Hospital Bill Controversy) అంశం కూడా వివాదానికి దారితీసింది. మొత్తం రూ.8 లక్షలు చెల్లించాలని ఆస్పత్రి యాజమాన్యం కోరినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు.
దీంతో వారు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. ఎల్ఎల్బీలో గోల్డ్ మెడల్ సాధించిన ఐశ్వర్య సికింద్రాబాద్ కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నారు. రెండు నెలల క్రితమే ఆమెకు వివాహమైంది. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలు వెల్లడించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఆస్పత్రి యాజమాన్యం స్పందన, వైద్యపరమైన వివరాలు స్వతంత్రంగా నిర్ధారించాల్సి ఉంది.