భూ వివాదంలో పంట ధ్వంసం
కోనరావుపేట, అక్టోబర్ 13 (విజయక్రాంతి): భూ వివాదం నేపథ్యంలో(Background of the land dispute) వరి పంటకు గడ్డి మందు కొట్టి నష్టం కలిగించినట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు ఇద్దరు నిందితులను కోనరావుపేట పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.వివరాల్లోకి వెళ్తే.. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామానికి చెందిన ఉప్పుల అంజయ్య 2000 సంవత్సరంలో 1 ఎకరం 20 గుంటల భూమిని కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు.
అయితే, ఆ భూమికి మ్యుటేషన్ చేయించుకోలేదు. ధరణి వచ్చిన తర్వాత అదే భూమి తమదంటూ దరిగె పర్వతాలు, దరిగె పద్మలు అంజయ్యను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.భూమికి సంబంధించిన ధరణి పాస్ పుస్తకాలు తమ వద్దే ఉన్నాయని, భూమి తమదేనని వారు వాదిస్తున్నట్లు తెలిపారు.
ఈ క్రమంలో అంజయ్య సాగు చేసిన వరి పంట మరో 20 రోజుల్లో కోతకు రావాల్సి ఉండగా, నిందితులు గడ్డి మందు కొట్టి పంటకు నష్టం కలిగించారని బాధితుడు కోనరావుపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.ఫిర్యాదు మేరకు కోనరావుపేట ఎస్సై బి. రామ్మోహన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.దర్యాప్తులో భాగంగా నిందితులైన దరిగె పర్వతాలు, దరిగె పద్మలను పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై బి. రామ్మోహన్ తెలిపారు.