పెద్దపల్లి లో బైక్ దొంగ అరెస్ట్
8 ద్విచక్ర వాహనాలు స్వాధీనం
నిందితుడి నుంచి రూ.లక్షల విలువైన వాహనాలు రికవరీ
విలేకరుల సమావేశంలో పెద్దపెల్లి ఏసిపి గజ్జి కృష్ణ యాదవ్
పెద్దపల్లి, నవంబర్ 06(విజయక్రాంతి): ద్విచక్ర వాహనాల చోరీలకు(Theft of two-wheeled vehicles) పాల్పడుతున్న నిందితుడిని పెద్దపల్లి పట్టణ పోలీసులు(Peddapalli Town Police) అరెస్ట్ చేసి, అతడి వద్ద నుంచి మొత్తం 8 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామని ఏసీపీ గజ్జి కృష్ణ యాదవ్ తెలిపారు. శుక్రవారం పెద్దపల్లి టౌన్ పోలీస్ స్టేషన్లో సీఐ ప్రవీణ్ కుమార్(CI Praveen Kumar), ఎస్ఐ రాజశేఖర్ తో కలిసి ఏసీపీ
మాట్లాడుతూ నిందితుడు గత కొంతకాలంగా బైక్లను చోరీ చేయాలని పథకం వేసుకుని, తాళాలు వేసి ఉన్న ద్విచక్ర వాహనాలను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నాడు. చోరీ చేసిన వాహనాలను తన అవసరాలకు వినియోగించుకుంటూ, మరికొన్నింటిని ఇతరులకు విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
ఈ క్రమంలో పెద్దపల్లి పట్టణ పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా రెండు బైక్ దొంగతనం కేసులు వెలుగులోకి వచ్చాయి. అతడి నుంచి హోండా షైన్, హీరో హోండా స్ప్లెండర్, టీవీఎస్ ఎక్స్ఎల్, హీరో ప్యాషన్ ప్లస్ తదితర మొత్తం 8 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటనకు సంబంధించి పెద్దపల్లి టౌన్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నంబర్ 285/2026, 286/2026 కింద బీఎన్ఎస్ సెక్షన్ 305(బి) ప్రకారం కేసులు నమోదు చేశారు.
నిందితుడిని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసు సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.