కురుమూర్తి క్షేత్రంలో అభివృద్ధి పనుల ప్రారంభం

06-11-2026 | 11:17pm

గాలిగోపురం, దాసంగాల షెడ్లు, డ్రైనేజీ వ్యవస్థను ప్రారంభించిన దేవరకద్ర ఎమ్మెల్యే జియంఆర్*

భక్తుల సౌకర్యార్థమే అభివృద్ధి పనులు

చిన్నచింతకుంట: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కురుమూర్తి స్వామి దేవస్థానం(Kurumurthy Temple) వద్ద రూ.75 లక్షల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను దేవరకద్ర శాసనసభ్యులు జి. మధుసూదన్ రెడ్డి (Devarakadra MLA G. Madhusudan Reddy) ప్రారంభించారు. మండల పరిధిలోని క్షేత్రంలో శుక్రవారం ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి, అభివృద్ధి పనుల శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో రూ.50 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన గాలిగోపురం, భక్తుల కోసం ఏర్పాటు చేసిన దాసంగాల షెడ్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం రూ.25 లక్షల వ్యయంతో ఆలయ పరిసరాల్లో పారిశుధ్యం మెరుగుపరిచేందుకు చేపట్టిన భూగర్భ మురుగునీటి పారుదల (అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ) వ్యవస్థను ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే జియంఆర్ మాట్లాడుతూ.. కురుమూర్తి స్వామి క్షేత్రానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. క్షేత్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో దేవాలయ ఈవో, ఆలయ కమిటీ చైర్మన్, పాలకమండలి సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు