జాబ్ మేళాలను యువత సద్వినియోగం చేసుకోవాలి
- కలెక్టర్ రాజర్షిషా
ఆదిలాబాద్,(విజయక్రాంతి): జిల్లా యువత జాబ్ మేళాల సద్వినియోగ పరచుకొని ఉపాధి అవకాశాలను పొందాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా పిలుపునిచ్చారు. మంగళవారం ఎస్టీయూ భవన్లో జిల్లా ఉపాధి కల్పన శాఖ, శ్రీ అష్టాలక్ష్మీ స్పిన్నింగ్ మిల్ సంయుక్తంగా నిర్వహించిన జాబ్ మేళా కార్యక్రమానికి మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనూష తో కలిసి హాజరై మాట్లాడారు. జాబ్ మేళా కు దాదాపు వెయ్యి మందికి పైగా అభ్యర్థులు హాజరై తమ పేర్లను నమోదు చేసుకున్నారని, అష్టలక్ష్మి స్పిన్నింగ్ మిల్స్ యాజమాన్యం తమను సంప్రదించి, పరిశ్రమలో ఉన్న ఖాళీల వివరాలను తెలపడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
టెక్స్‌టైల్ పరిశ్రమలలో టెక్నీషియన్లు, సూపర్‌వైజర్లు, ఫిట్టర్లు, ఆపరేటర్లు వంటి వివిధ విభాగాల్లో నిరంతరం మ్యాన్‌పవర్ అవసరం ఉంటుందని పేర్కొన్నారు. ఈ జాబ్ మేళాలో ఎంపికైతే ట్రైనింగ్ ఇచ్చి, వారి పనితీరు ఆధారంగా ఉద్యోగాలను పర్మనెంట్ చేయడం జరుగుతుందన్నారు. అనంతరం పలువురికి నియామక పత్రాలను కలెక్టర్, మున్సిపల్ చైర్ పర్సన్ అందజేశారు. ఈ జాబ్ మేళాలో జిల్లా ఉపాధి కల్పన అధికారి మిల్కా, ఆష్టాలక్ష్మి స్పిన్నింగ్ మిల్ ప్రతినిధులు విక్రాంత్ కేతన్, గణేష్, ఇతర అధికారులు, యువత, నిరుద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






