అనుమానాస్పద స్థితిలో కార్మికుడి మృతి
హత్యా? ఆత్మహత్యా?
షాద్ నగర్,(విజయక్రాంతి): కొందుర్గు మండల పరిధిలోని చిన్న ఎక్కిచర్ల గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న బిందు శ్రీ పేపర్ మిల్ కంపెనీలో పనిచేస్తున్న పక్క రాష్ట్రానికి చెందిన ఓ కార్మికుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. గ్రామ శివారులోని చెట్టుకు ఉరివేసుకున్న స్థితిలో కార్మికుడి మృతదేహాన్ని పరిసర ప్రాంతాల వ్యక్తులు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. మృతుడు ఆత్మహత్య చేసుకున్నాడా..? లేక ఎవరైనా హత్య చేసి ఉరివేసారా..? అన్న కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు. మృతుడి వివరాలు, మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పోస్టుమార్టం నివేదిక అనంతరం పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.






