కారు అదుపుతప్పి బోల్తా.. మహిళ మృతి
కల్వకుర్తి ఏప్రిల్ 24 :బంధువులకు కుమారుని పెళ్లి ఆహ్వాన పత్రికలు పంపిణీ చేసేందుకు వెళ్తుండగా కారు అదుపుతప్పి బోల్తా పడి ఓ మహిళ మృతి చెందిన విషాదకర ఘటన శుక్రవారం కల్వకుర్తి– నాగర్ కర్నూల్ ప్రధాన రహదారిపై తుర్కలపల్లి గేట్స్ సమీపంలో చోటుచేసుకుంది. కోడేరు మండలం పసుపుల గ్రామానికి చెందిన పార్వతమ్మ (50) కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్‌లో నివాసం ఉంటోంది. ఆమె కుమారుని వివాహం ఈనెల 30న జరగనుండడంతో, పెళ్లి ఆహ్వాన పత్రికలు పంపిణీ చేయడానికి హైదరాబాద్ నుంచి కుమారునితో కలిసి స్వగ్రామానికి బయలుదేరింది.
ఈ క్రమంలో తుర్కలపల్లి గేటు సమీపంలో కారు అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాద సమయంలో కారులో పార్వతమ్మతో పాటు ఆమె కుమారుడు, మరో వ్యక్తి ఉన్నారు. వీరికి స్వల్ప గాయాలు కాగా, పార్వతమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. 108 అంబులెన్స్‌లో ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. అనంతరం మృతదేహాన్ని కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నాలుగు రోజుల్లో ఇంట్లో శుభకార్యం జరగాల్సి ఉండగా, ఇలాంటి విషాదం చోటుచేసుకోవడంతో కుటుంబంలో తీవ్ర శోకం నెలకొంది.






