16 May, 2026 | 9:02 AM

బడికి ‘బాట’ చూపేనా?

16-05-2026 01:41 AM

మూసిన బడి తెరుచుకునేనా

మహబూబాబాద్, మే 15 (విజయక్రాంతి): రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ విద్యావ్యవస్థ పటిష్టత కోసం చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లాలో గతంలో మూతపడ్డ ప్రభుత్వ పాఠశాలలు తిరిగి తెరుచుకోవడంతోపాటు మూసివేతకు సమీపంలో ఉన్న పలు పాఠశాలల్లో విద్యార్థుల నమోదుకు బడి‘బాట’ కార్యక్రమం దోహదపడుతుందా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉచితంగా విద్యా బోధనతో పాటు మధ్యాహ్న భోజనం, అల్పాహారం, పుస్తకాలు, తదితర 22 రకాల సౌకర్యాలను కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం ఈ విద్యా సంవత్సరం అదనంగా ఒక గంట పని సమయాన్ని ఉపాధ్యాయులు వెచ్చించాలని కూడా నిర్దేశించింది. ఈ క్రమంలో మహబూబాబాద్ జిల్లా పరిధిలోని 18 మండలాల్లో గత విద్యా సంవత్సరం వరకు 162 పాఠశాలలు జీరో ఎన్రోల్మెంట్ కారణంగా మూసి వేయబడ్డాయి.

ఇందులో ప్రధానంగా 135 పాఠశాలలు పూర్తిగా గిరిజన ఆవాస ప్రాంతాల్లో మూతపడడం గమనార్హం. మహబూబాబాద్ జిల్లా పూర్తిగా గిరిజన ప్రాంతంగా గుర్తించబడగా, ఈ జిల్లాలో అత్యధికంగా గిరిజనులు నివసించే మరిపెడలో 36 పాఠశాలలు, మహబూబాబాద్ మండలంలో 21 పాఠశాలలు మూసివేతకు గురి కావడం విస్మయాన్ని కలిగిస్తోంది. 2025 - 26 విద్యా సంవత్సరంలో ఐదుగురు విద్యార్థులు మాత్రమే ఉన్న పాఠశాలలు 76 ఉండటం మరో ఆందోళనకరమైన అంశం.

ఈ సంవత్సరం ఆ పాఠశాలలో విద్యార్థులను నమోదు పెంచకపోతే అవి కూడా మూసివేతకు గురయ్యే పరిస్థితి నెలకొంది. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల సంఖ్య 924 కాగా, 762 పాఠశాలలు ప్రస్తుతం పని చేస్తున్నాయి. అన్ని ప్రభుత్వ, గురుకుల పాఠశాలల్లో కలిపి 95 వేలకు పైగా విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. అయితే గురుకులల్లో విద్యార్థుల సంఖ్య ఆశించిన మేరకు ఉండగా, జిల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాలల పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది.

జిల్లావ్యాప్తంగా పలు పాఠశాలల్లో ఆశించిన మేర విద్యార్థుల సంఖ్య ఉండడంతో పాటు, ఉత్తీర్ణత శాతం కూడా మంచి ఫలితాలు సాధిస్తున్నాయి. అయితే చాలా ప్రభుత్వ పాఠశాలల్లో ఆ విధంగా ఆశించిన స్థాయిలో విద్యార్థులు చేరడానికి అయీష్టత చూపుతున్నారు. మౌలిక వసతులు లేకపోవడం, కొన్నిచోట్ల పాఠశాలలకు భవనం లేకపోవడంతో అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. దీనితో చాలా చోట్ల ప్రభుత్వ పాఠశాలల ఉనికి రోజు రోజుకు ప్రశ్నార్థకంగా మారుతుంది. 

ఈ క్రమంలో ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరంలో ప్రత్యేకంగా గ్రామస్థాయి నుండి మొదలుకొని జిల్లా స్థాయి వరకు ప్రజాప్రతినిధులతో కూడా ప్రభుత్వ విద్యాలయాల్లో విద్యార్థుల నమోదు పెంచడానికి సహకరించే విధంగా బడిబాట కార్యక్రమాన్ని రూపొందించింది.

దీంతో జిల్లా స్థాయి అధికారులు, గ్రామ సర్పంచుల నుంచి మొదలుకొని మున్సిపల్ చైర్పర్సన్లు, వార్డు కౌన్సిలర్లు, వార్డు సభ్యులను కలుపుకొని ప్రత్యేక సమావేశాలు నిర్వహించి, క్షేత్రస్థాయిలో బడి ఈడు పిల్లలను గుర్తించి ప్రభుత్వ బడిలో చేర్పించే విధంగా కృషి చేస్తున్నారు. అయితే ఇది ఆచరణలో ఎంత మేరకు విజయవంతం అవుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది.

మహబూబాబాద్ జిల్లాలో జీరో ఎన్రోల్మెంట్ స్కూల్స్..

1.బయ్యారం.. 1

2.గార్ల... 5

3.డోర్నకల్.. 13

4.కురవి... 8

5.మరిపెడ.. 36

6.నర్సింహులపేట.. 7

7.దంతలపల్లి.. 6

8.చిన్న గూడూరు. 10

9.సీరోల్..2

10.మహబూబాబాద్.. 21

11.గూడూరు.. 5

12.కేసముద్రం.. 11

13.నెల్లికుదురు.. 5.

14.ఇనుగుర్తి.. 10

15.తోర్రు ర్.. 9

16.పెద్దవంగర.. 4

17.కొత్తగూడ 4.

18.గంగారాం.. 4.

మొత్తం.. 162.

------

ప్రభుత్వ బడి మనదనే నమ్మకాన్ని కలిగించాలి: సత్యనారాయణమూర్తి, డీఈవో, మహబూబాబాద్

ప్రభుత్వ బడి ప్రజలందరిలో మనదనే నమ్మకాన్ని కలిగించాలి. ప్రతి గ్రామపంచాయతీలో ప్రభుత్వ బడి ఉండే విధంగా, బడి ఈడు పిల్లలు అంతా అక్కడే చదువుకునే విధంగా చర్యలు తీసుకోవాలి. జిల్లా అధికారి నుంచి మొదలుకొని మండల స్థాయి అధికారి వరకు నిత్యం పర్యవేక్షించాలి. ప్రజా ప్రతినిధులను ప్రభుత్వ విద్యాభివృద్ధిలో భాగస్వామ్యం కల్పించాలి. చిన్న బడులను మూసివేస్తూ, ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా స్కూళ్లు ఏర్పాటు చేస్తే విద్యాభివృద్ధి కాదు. తిరోగమన చర్య అవుతుంది. విద్యాలయాల్లో మౌలిక వసతులు మెరుగు పరచాలి. 

మైస శ్రీనివాసులు, టి పి టి ఎఫ్, పూర్వ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యం

ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యంగా సమిష్టిగా ముందుకు సాగుతున్నాం. ప్రతి ఆవాస ప్రాంతంలో బడిబాట కార్యక్రమం ద్వారా ఇంటింటికి తిరిగి బడి ఈడు గల పిల్లలను గుర్తించి, ఆ ఆవాస ప్రాంతంలో ఉన్న పాఠశాలలో చేరే విధంగా కృషి చేస్తాం.  మౌలిక వసతుల కల్పనతో పాటు ప్రభుత్వం విద్యాభివృద్ధికి అమలు చేస్తున్న పథకాలను తల్లిదండ్రులకు వివరిస్తాం. జనగణన విధుల్లో లేని ఉపాధ్యాయులను బడిబాటలో భాగస్వామ్యం చేస్తాం. ప్రజా ప్రతినిధులు, ఇతర శాఖల సమన్వయంతో మానుకోట జిల్లాలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తాం.