28 May, 2026 | 2:41 AM

తడిసిన ధాన్యం కొంటాం

28-05-2026 01:38 AM
  1. రైతులూ ఆందోళన వద్దు
  2. కొన్న వెంటనే మిల్లులకు తరలింపు: మంత్రి ఉత్తమ్

హైదరాబాద్ మే 27(విజయక్రాంతి): తడిసిన ధాన్యాన్ని తప్పకుండా కొనుగో లు చేస్తామని, రైతులు ఎటువంటి ఆం దోళనా చెందాల్సిన అవసరం లేదని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. కొనుగోలు చేసిన తడిసిన ధాన్యాన్ని సత్వరమే బాయిల్ రైస్ మిల్లులకు తరలిస్తున్నామన్నారు. అకాల వర్షాలకు తడిసిన 9,214 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఇప్పటికే బాయిల్ రైస్ మిల్లులకు తరలించినట్లు మంత్రి వెల్లడించారు.

అకాల వర్షాలు సంభవించడంతో ధాన్యం కొనుగోలు కేంద్రా ల్లో ఉత్పన్నమైన పరిణామాలను సమీక్షించేందుకు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, సీఎస్ రామకృష్ణారావు, పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, కలెక్టర్లు, పోలీస్, రవాణా, పౌర సరఫరాల శాఖాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ రైతాంగానికి నష్టం వాటిల్లే ఏ చర్యలనూ ప్రభుత్వం చూస్తూ ఊరుకోబోద న్నారు.

చివరి గింజ వరకూ కొనుగోలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం రికార్డ్ స్థాయిలో అదీ రబీసీజన్‌లో 75 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలుకు ఉపక్రమించిందని తెలిపారు. ఇప్పటివరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు 66.75 లక్షల టన్నుల ధాన్యం చేరిందన్నారు. అందులో 57 లక్షల టన్నుల ధాన్యాన్ని కొన్నామని, రైతులకు ఇప్పటివరకు రూ.10,097 కోట్లను ప్రభుత్వం చెల్లించిందని తెలిపారు. దీనివల్ల 8.15 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరిందని పేర్కొన్నారు.

ఇసుక సరఫరా చేసే లారీలను ధాన్యం కొనుగోలు కేంద్రాలకు మళ్లించి, సత్వరమే ధాన్యాన్ని మిల్లులకు రవాణా చేసేందుకు వినియోగిస్తున్నట్లు ఆయన తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ముందెన్నడూ లేని రీతిలో 8,575 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి రికార్డ్ స్థాయిలో ధాన్యం కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. ప్రతిపక్షాలు ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను రాద్ధాంతం చేసి, రాజకీయ లబ్ధిపొందాలని చూస్తున్నాయని ఆయన మండిపడ్డారు.