31 May, 2026 | 12:51 AM

పాలమూరును సస్యశ్యామలం చేస్తాం

31-05-2026 12:15 AM
  1. ఎత్తిపోతల పథకంపై బీఆర్‌ఎస్ నేతలవి అబద్ధాలు
  2. జూన్ 4, 5 తేదీల్లో సీఎంతో కలిసి ప్రాజెక్ట్‌లను పరిశీలిస్తాం
  3. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
  4. రూ.32 కోట్లతో అడవి అజిలాపూర్ లిప్ట్ ఇరిగేషన్
  5. శంకుస్థాపన చేసిన మంత్రులు ఉత్తమ్, వాకిటి శ్రీహరి 

దేవరకద్ర, మే 30(విజయక్రాంతి): ఉమ్మ డి పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేసేందుకు తమ ప్రభుత్వం కట్టు బడి ఉందనిరాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ టర్మ్ లోనే కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, పాలమూరు ఎత్తిపోతల పథకం తదితర పనులన్నింటినీ పూర్తి చేసి, పాలమూరు గడ్డను సస్యశ్యామలం చేస్తామని, దానికి సంబంధించి అవసరమైన నిధులను తక్షణమే విడుదల చేస్తామని మంత్రి జిల్లా ప్రజలకు భరోసా ఇచ్చారు.

శనివారం రూ. 32 కోట్ల ఐదు లక్షల నిధులతో దేవరకద్ర మండలంలోని అడవి అజిలాపూర్ లిఫ్ట్ ఇరిగేషన్‌కు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ప్లానింగ్‌కమిషన్ వైస్ చైర్మన్ జిల్లెల చిన్నారెడ్డి, స్థానిక దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డితో కలసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శంకుస్థాపన చేసి అనంతరం మాట్లాడారు. వచ్చే నెల జూన్ 4, 5 తేదీల్లో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఉమ్మడి పాలమూరు జిల్లాలోని అన్ని ప్రాజెక్టులను స్వయంగా పరిశీలిస్తామన్నారు.

పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ఎన్ని వేల కోట్ల రూపాయలైనా ఖర్చు పెట్టడానికి మా ప్రభుత్వం వెనకాడదన్నారు. గత పాలకులకు కాళేశ్వరం ప్రాజెక్టుపై ఉన్న శ్రద్ధ.. పాలమూరు ప్రాజెక్టులపై లేదని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండి పడ్డారు. పాలమూరు ఎత్తిపోతల పథకం 90 శాతం పూర్తయిందని బీఆర్‌ఎస్ నేతలు అబద్ధాలు చెప్తున్నారని ధ్వజమెత్తారు.

జిల్లా ప్రాజెక్టులకు సంబంధించిన పెండింగ్ బిల్లులన్నింటినీ క్లియర్ చేసి, పనులను వేగవంతం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అనంతరం రాజమూర్ సమీపంలో వరి కొనుగోలు కేంద్రాన్ని స్థాని క ఎమ్మెల్యే జీఎంఆర్‌తో కలిసి మంత్రులు పరిశీలించి, కొనుగోలు ప్రక్రియపై రైతులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే జీఎంఆర్ మాట్లాడుతూ నెల్విడి, కురుమూర్తి రాయ, సరళ సాగర్ ఎత్తిపోతల పథకాల మరమ్మత్తులకు నిధులు మంజూరు చేసినందుకు అజిలాపూర్ లిఫ్ట్ మంజూరు చేసినం దుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు.

కోయిల్‌సాగర్ పెండింగ్ పనులకు 150 కోట్లు మంజూరు చేయాలని, చౌదర్‌పల్లి లిఫ్ట్‌ను మంజూరు చేయాలని, దానికి సంబంధించి ఇప్పటికే రూ 87 కోట్ల నిధుల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించడం జరిగిందని, చౌదర్‌పల్లి లిఫ్ట్‌నకు అనుమతులు ఇవ్వాలని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మంత్రిని కోరారు.

ఈ కార్యక్రమంలో కోయిల్ సాగర్, అడివి అజిలపూర్ గ్రామాలకు చెందిన ప్రస్తుత ఉప సర్పంచ్, మాజీ సర్పంచ్ బిఆర్‌ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు,ఎమ్మెల్యే జీఎంఆర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు అధికారులు తదితరులు ఉన్నారు.  

ప్రతి గింజా కొంటాం

  1. పాలమూరులో నాలుగు రోజుల్లో ధాన్యం కొనుగోలు పూర్తిచేయాలి
  2. మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి

మహబూబ్ నగర్, మే 30 (విజయ క్రాంతి): రైతు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామని పౌరసరఫరాల, నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు సంబంధించిన ధాన్యం కొనుగో లు ప్రక్రియను వారం రోజుల్లో ‘జూన్ 4, 5 తేదీలోగా) పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.

శనివారం మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలకు సంబంధించిన ధాన్యం కొనుగోలు అంశంపై మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జీ చిన్నారెడ్డితో కలిసి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన కలెక్టర్లు ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు, నిల్వ, రవాణా ప్రక్రియలపై మంత్రులకు వివరించారు.

రాష్ట్రంలో రైతులు నష్టపోకుండా తడిసిన ధాన్యం మద్దతు ధరకు కొనుగోలు చేసి, బాయిల్ మిల్లులకు తరలిస్తున్నామని తెలిపారు. వాతావరణ శాఖ జూన్ 4వ తేదీ తర్వాత వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించిన నేపథ్యంలో వారం రోజుల్లోగా  ధాన్యం కొనుగోళ్లు పూర్తిచేయాలని కలెక్టర్లకు సూచించారు. కొనుగోలు కేంద్రాలకు అదనంగా వచ్చిన ప్రతి గింజనూ కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి స్పష్టం చేశారు.

రైతులకు ఇబ్బంది కలిగించేలా తాలు, తరుగు పేరుతో కోతలు విధించే మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వరి ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలుచేస్తామని, రైతులు ఆందోళన చెందకూడదని మంత్రి శ్రీహరి అన్నారు. చిన్నా రెడ్డి మాట్లాడుతూ ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్లను  లారీ లు సరఫరాచేసే కాంట్రాక్టర్లకు అప్పజెప్పాలన్నారు.

ఎమ్మెల్యే శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ వనపర్తి జిల్లా మినహా మిగతా జిల్లాల్లో 2, 3 రోజుల్లోనే ధాన్యం సేకరణ పూర్తి అవుతుందన్నారు. ఈ సందర్భంగా రూ.5.34 కోట్ల చెక్కును మహిళా సంఘాలకు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అందజేశారు.