26 March, 2026 | 12:59 PM

Breaking News

బీఆర్ఎస్ హయాంలో సీఎం రిలీఫ్ ఫండ్ దుర్వినియోగం.. ఎవరు కాజేశారో తెలుసు!   •   మార్కాపురం బస్సు అగ్నిప్రమాదం — 13 మంది సజీవ దహనం, హెల్ప్‌లైన్ నంబర్లు ఇవే!   •   మార్కాపురం బస్సు దుర్ఘటనపై మోదీ సంతాపం — 14 మంది మృతికి రూ.2 లక్షల పరిహారం!   •   దావోస్ పెట్టుబడులపై అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు సమాధానం   •   మార్కాపురం బస్సు ప్రమాదంపై స్పందించిన కేంద్రమంత్రులు   •   మార్కాపురం బస్సు ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి   •   కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాను కలిసిన జాతీయ ఆర్ఎంపీ, పీఎంపీ జేఏసీ నాయకులు   •   డ్రైవర్ నిర్లక్ష్యంతో నరకం — మార్కాపురంలో 13 మంది సజీవ దహనం, డ్రైవర్ పరారు!   •   పట్నంలో ‘పాత రాతియుగం పనిముట్లు’   •   శ్రీరామనవమి నాడు కవిత కొత్త పార్టీ   •  

‘2 బీహెచ్‌కే’ కేటాయింపులు పూర్తి చేస్తాం

26-03-2026 12:00 AM

త్వరలో 1.12 లక్షల ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాలు

హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

హైదరాబాద్, మార్చి 25 (విజయక్రాంతి): ‘ప్రజాపాలన- ప్రణాళిక-’ 99 రోజుల కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో అసంపూర్తిగా ఆగిపోయిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం పూర్తిచేయడమే గాక, ఖాళీగా ఉన్న ఇండ్లను అర్హులైన నిరుపేదలకు కేటాయిస్తామని హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. శాసనసభ సమావేశాల్లో బుధవారం కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు ఇందిరమ్మ ఇండ్లు, డబుల్ బెడ్ రూం ఇళ్ల అంశాలపై అడిగిన ప్రశ్నలకు పొంగులేటి వివరణ ఇచ్చారు.

సమస్యలను పరిష్కరించేందుకు వీలుగా త్వర లో ఉమ్మడి జిల్లాల పరిధిలో ప్రత్యేక సమీక్షా సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల సమస్యలను పరిష్కరించేందుకు గానూ టోల్ ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తెస్తామని, వీటి ద్వారా వచ్చే ప్రశ్నలకు 24 గంటల్లోగా సమాధానం చెప్పడమేగాక వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. రాష్ట్రంలో  ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి మూడు విభాగాలుగా సమస్యలను విభజించి పరిష్కరించడానికి చర్యలు చేపట్టినట్లు మంత్రి తెలిపారు.

గత ప్రభుత్వం రెండు లక్షల పైచిలుకు ఇండ్లను మంజూరు చేసి హైదరాబాద్ ప్రాంతానికి లక్ష ఇండ్లను కేటాయించగా వీటిలో 78,861 ఇండ్లు పూర్తయినా మౌలిక సదుపాయాలకు నోచుకోలేదని, 21, 838  ఇండ్లు కేవలం పునాదులకే పరిమితమయ్యాయని తెలిపారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 26 కాలనీలు అసంపూర్తిగా ఉండిపోయాయని, తామ కొత్తగా కంటోన్మెంట్ నియోజకవర్గానికి ఇండ్లు మంజూరు చేశామని వివరిస్తూ రూ. 738 కోట్ల రూపాయిలతో మౌలిక సదుపాయాలు కల్పించామని తెలిపారు. తాము గతంలో అసంపూర్తిగా మిగిలిపోయిన 92 వేల ఇళ్లలో 62 వేల ఇళ్లు పూర్తి చేశామని చెప్పారు.

2023 ఎన్నికలకు ముందు నాటి ప్రభుత్వం 23,500 ఇండ్లను కేటాయించిందని, అయితే నగరంలో వృత్తి వ్యాపారాలు చేసుకునే వారు సమారు 20 కిలోమీటర్ల దూరంలో కేటాయించిన ఇండ్లలోకి రాకపోవడంతో 12వేలకు పైగా ఇండ్లు ఖాళీగా ఉండిపోయాయని వివరించారు. లబ్దిదారులకు మరో అవకాశాన్ని కల్పిస్తూ రెండు నెలల్లోగా వీటిలో గృహప్రవేశాలు చేయాలని నోటీసులు ఇచ్చామని తెలిపారు.

ఒకవేళ వారు రాలేక పోతే సుమారు 5 కిలోమీటర్ల పరిధిలో ఉండే అర్హులైన పేదలకు కేటాయించేందుకు నిర్ణయించామని మంత్రి పొంగులేటి తెలిపారు. రాష్ట్రంలో తొలివిడత 4.50 లక్షల ఇండ్లు మంజూరు చేస్తూ ప్రత్యేకంగా చెంచులకు, ఐటీడీఏ పరిధిలో గిరిజనులకు 12 వేల ఇండ్లను మంజూరు చేశామని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల కమిటీలకు గ్రామాల్లో సర్పంచ్ అధ్యక్షునిగా ఉంటారని, ఆయన ఆధ్వర్యంలోని కమిటీ నిరుపేదలను ఎంపిక చేస్తే కలెక్టర్ పరిశీలన, అనంతరం జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆమోదంతో కేటాయింపులు జరుగుతాయని చెప్పారు.

రాష్ట్రంలో ఈ మార్చి 31నాటికి సుమారు లక్షా 12 వేల ఇందిరమ్మ ఇండ్లు పూర్తయి గృహప్రవేశాలు జరుగనున్నాయని, వచ్చే జూన్ నాటికి  మరో లక్ష ఇండ్ల నిర్మాణం పూర్తవుతుందని వెల్లడించారు. ఏప్రిల్ నెలలో రెండవ విడత  ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని తెలిపారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇండ్ల నిర్మాణా నికి గాను ఇప్పటికే 14- స్థలాలను గుర్తించామని, ఆయా ప్రాంతాలలోని నిరుపేదలకు ఇండ్లు ఇస్తామని స్పష్టం చేశారు.