9 April, 2026 | 4:24 AM

రెంటల్ విధానమే కావాలి

09-04-2026 12:00 AM

‘టీఎఫ్‌సీసీ’కి వ్యతిరేకంగా ‘గిల్డ్’ ప్రకటన

టాలీవుడ్ ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల మధ్య దశాబ్దాలుగా జరుగుతున్న రెంటల్ వివాదానికి తెర దించుతూ తెలంగాణ ఫిలించాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎఫ్‌సీసీ) ఇటీవల ఓ నిర్ణయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ కొత్త విధానాన్ని రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని 23 ప్రధాన థియేటర్ల యాజమాన్యాలు ఏప్రిల్ 3వ తేదీ నుంచి అమలులోకి తెచ్చాయి. అయితే, టీఎఫ్‌సీసీ తీసుకున్న పర్సంటేజీ విధానాన్ని ‘గిల్డ్’ ప్రొడ్యూసర్లు వ్యతిరేకిస్తున్నారు.

ఈ విషయమై యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ ఓ ప్రకటన విడుదల చేశారు. ‘యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ సభ్యులమైన మేము పర్సంటేజీ విధానంలో సినిమాల ప్రదర్శనకు సంబంధించి టీఎఫ్‌సీసీ తీసుకున్న ఏకపక్ష నిర్ణయం మాకు ఆమోదయోగ్యం కాదు. ఎగ్జిబిటర్లతో చర్చలు జరిపి, మా అభిప్రాయం వెల్లడిస్తాం. అప్పటివరకు పాత విధానా (రెంటల్ సిస్టమ్)న్నే కొనసాగిస్తాం. టీఎఫ్‌సీసీ నిర్ణయించిన విధానాన్ని అమలుచేసే థియేటర్లలో మా సినిమాలను ప్రదర్శించడానికి మేము సుముఖంగా లేము’ అని పేర్కొన్నారు.

ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న నిర్మాతల్లో రవిశంకర్ యలమంచిలి (మైత్రి),  సుధాకర్ చెరుకూరి (ఎస్‌ఎల్‌వీ సినిమాస్), టీజీ విశ్వప్రసాద్ (పీపుల్ మీడియా ఫ్యాక్టరీ), నాగవంశీ (సితార ఎంటర్‌టైన్‌మెంట్స్), రవికిషోర్ పీవీ (స్రవంతి), సుప్రియ యార్లగడ్డ (అన్నపూర్ణ స్టూడియోస్), బాపినీడు బీ (ఎస్‌వీసీసీ), స్వప్నా దత్ (స్వప్న సినిమా), సాహు గారపాటి (షైన్‌స్క్రీన్స్), రాజీవ్ రెడ్డి వై (ఫస్ట్ ఫ్రేమ్), వెంకట సతీశ్ కిలారు (వృద్ధి సినిమాస్), హీరో నాని (వాల్ పోస్టర్ సినిమా), చిట్టూరి శ్రీనివాసరావు (శ్రీనివాస వెండితెర), బన్నీ వాసు (బన్నీ వాస్ వర్క్స్), ఎస్‌కేఎన్ (మాస్ మూవీ మేకర్స్), ధీరజ్ మొగిలినేని (ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్) ఉన్నారు.