ఆదివాసీల సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకోవాలి
- మున్సిపల్ చైర్ పర్సన్ బండారు అనూష
ఆదిలాబాద్,(విజయక్రాంతి): ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు చాలా గొప్పవని, వాటిని కాపాడుకుంటూ చదువులో ముందుకు సాగాలని ఆదిలాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ బండారు అనూష అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో తెలంగాణ ఆదివాసీ విద్యార్థి సంఘం (TAVS), తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం (TAGS) ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవం వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై అసిస్టెంట్ ట్రైబల్ డెవలప్ మెంట్ అధికారి అనిల్ కుమార్ తో కలిసి మాట్లాడారు.
విద్యతోనే సమాజ మార్పు సాధ్యమని, అందుకు అందరు చదవాలని, ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకొని మంచి స్థానాలలో సమాజాన్ని నిలబెట్టాలని సూచించారు. TAGS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసం సచిన్ మాట్లాడుతూ 75 ఏండ్ల స్వాతంత్ర భారత దేశంలో నేటికీ ఆదివాసీల జీవన ప్రమాణాలు, విద్యా వైద్యం, కనీస వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ అధికారంలోకి వచ్చాక భారత రాజ్యాంగం ఐదవ షెడ్యూల్ లో కల్పించిన హక్కులు, చట్టాలను పూర్తిగా నిర్వీర్యం చేసేలా విధానాలను ఆవలంబిస్తుందని విమర్శించారు.
ఆదివాసీలకు ఆస్తిత్వం లాంటి 1/70 చట్టం నేడు ప్రమాదంలో ఉందని, దానిని కాపాడేందుకు, GO 3 పునరుద్దరణ కై ఆదివాసీ యువత ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఆదివాసీలు సాగు చేస్తున్న పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని, ఫారెస్ట్ అధికారుల దాడులు ఆపాలని, ఏజెన్సీ ప్రాంతంలో అన్ని గ్రామాలకు రోడ్లు, మంచినీరు, ఇతర కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
అంతకు ముందు భగత్ సింగ్ చౌక్ నుంచి ZP సమావేశం మందిరం వరకు భారీ ర్యాలీ, నినాదాలతో హోరేత్తించారు. సాంస్కృతిక కళారూపాలతో, ఆట పాటలతో అమరవీరులకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాగోబా విద్యాలయం ప్రిన్సిపాల్ మెస్రం రాజు, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఆశన్న, TAGS సంఘం జిల్లా అధ్యక్షులు ఉయిక విష్ణు, జిల్లా నాయకులు కొట్నాక్ సక్కు, పెందూర్ గోవింద్, కుంర భీంరావు, AIDWA జిల్లా అధ్యక్షులు కోవా శకుంతల, నాయకులు నర్మదా, మాణిక్ తదితరులు పాల్గొన్నారు.






