రంగనాయక సాగర్‌పై విజిలెన్స్ దర్యాప్తు వేగం
- ప్రాజెక్టు పూర్తి వివరాలివ్వాలని అధికారులకు ఆదేశాలు
- భూసేకరణలో అవకతవకలు జరిగాయని ఫిర్యాదు
హైదరాబాద్, ఏప్రిల్ 16 (విజయక్రాంతి) : కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగమైన రంగనాయక సాగర్ రిజర్వాయర్ నిర్మాణంపై వచ్చిన అవకతవకల ఆరోపణలు ఇప్పుడు అధికారిక దర్యాప్తు దశకు చేరాయి. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ లోతైన విచారణ ప్రారంభించడంతో ప్రాజెక్టు పనులపై కొత్త ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రంగనాయక సాగర్ రిజర్వాయర్ నిర్మాణం, భూసేకరణ ప్రక్రియల్లో అవకతవకలు జరిగాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికా రులు దర్యాప్తును ప్రారంభించారు.
ఈ క్రమంలో ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చందులాపూర్ సమీపంలో మూడు టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన ఈ రిజర్వాయర్, కాళేశ్వరం ప్రాజెక్టులో కీలక భాగంగా భావించబడుతోంది. అయితే నిర్మాణ ప్రక్రియలో పారదర్శకతపై అనుమానాలు వ్యక్తమ వడంతో విచారణకు రంగం సిద్ధమైంది. ఈ నెల 4న విజిలెన్స్ ఎస్పీ శృతకీర్తి, కాళేశ్వరం చీఫ్ ఇంజినీర్ (గజ్వేల్)కు లేఖ రాసి తొమ్మిది కీలక అంశాలకు సంబంధించిన పూర్తి రికార్డులు అందజేయాలని కోరారు.
ఇందులో ప్రాజెక్టు ఇన్వెస్టిగేషన్, సర్వే నివేదికలు, డీపీఆర్, ఫీజిబిలిటీ స్టడీలు, అంచనాలు, ఒప్పందాల అనుమతులు వంటి పరిపాలన, సాంకేతిక అంశాలు ఉన్నాయి. అదే విధంగా మట్టి కట్ట నిర్మాణానికి సంబంధించిన డిజైన్లు, డ్రాయిం గ్స్, జియోలాజికల్ ఇన్వెస్టిగేషన్ వివరాలు, నీటి లభ్యత అంచనాలు, ప్రాజెక్టు ఒరిజినల్ ఎలైన్మెంట్, దానిలో చేసిన మార్పుల వివరాలు కూడా సమర్పించాలని సూచించారు.
భూసేకరణ, ల్యాండ్ పూలింగ్, అటవీ భూముల మళ్లింపు, బాధితులకు చెల్లించిన పరిహారం వివరాలు, అలాగే హైపవర్ కమిటీ, స్టేట్ లెవెల్ స్టాండింగ్ కమిటీల సమావేశ మినిట్స్ కూడా ఇవ్వాలని విజిలెన్స్ స్పష్టం చేసింది. ప్రాజెక్టు ప్రారంభం నుంచి పూర్తయ్యే వరకు చీఫ్ ఇంజినీర్, ఇంజినీర్ ఇన్ చీఫ్ సమీక్షా నివేదికలు, కార్యాలయ ఉత్తరప్రత్యుత్తరాలన్నీ కూడా సమర్పించాలని గడువు విధించారు.
ఈ మేరకు ప్రాజెక్టు ఇంజినీర్లు అవసరమైన రికార్డులను నేరుగా విజిలెన్స్ కార్యాలయంలో అందజేసినట్లు సమాచారం. ఇప్పటికే మేడిగడ్డ, అన్నా రం, సుందిళ్ల బ్యారేజీలతో పాటు మిడ్ మానే రు నుంచి మల్లన్నసాగర్, కొండపోచమ్మకు నీటిని మళ్లించే పనులపై విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో, ఇప్పుడు రంగనాయక సాగర్ పనులపై కూడా దృష్టి సారించడం ప్రాజెక్టు మొత్తం అమలుపై మరింత పరిశీలన జరుగుతోందని సూచిస్తోంది. విజిలెన్స్ దర్యాప్తు ఫలితాలు వెలుగులోకి వస్తే కాళేశ్వరం ప్రాజెక్టు అమలులో పారదర్శకత, బాధ్యతపై కీలక అంశాలు బయటపడే అవకాశముంది.






