కారు అదుపు తప్పి చెట్టును ఢీకొని ఇద్దరు యువకులు మృతి
కల్వకుర్తి: వరుసకు సోదరులతో కలిసి కల్వకుర్తి పట్టణానికి వెళ్లి తిరిగి స్వగ్రామానికి వస్తుండగా కారు అదుపుతప్పి చెట్టును ఢీకొని ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలైన సంఘటన మంగళవారం తెల్లవారుజామున హైదరాబాద్ శ్రీశైలం ప్రధాన రహదారిపై చోటుచేసుకుంది. కల్వకుర్తి ఎస్సై కురుమూర్తి తెలిపిన వివరాల ప్రకారం, వంగూరు మండల కేంద్రానికి చెందిన బొడ్డుపల్లి ప్రవీణ్ (27), బొడ్డుపల్లి బాలు (29), రాజు అనే ముగ్గురు యువకులు మంగళవారం తెల్లవారుజామున కల్వకుర్తి నుంచి కారులో స్వగ్రామం వంగూరుకు బయలుదేరారు. హైదరాబాద్–శ్రీశైలం ప్రధాన రహదారిపై కొండారెడ్డిపల్లి గేట్ సమీపంలో కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ప్రవీణ్, బాలు అక్కడికక్కడే మృతి చెందగా, రాజు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతడిని చికిత్స నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ముగ్గురు యువకులు వరుసకు సోదరులు కాగా, ఇటీవల రాజు తల్లి మరణించడంతో దశదిన కార్యక్రమాలు పూర్తి చేసుకుని పనిమీద కల్వకుర్తికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పంచనామా నిర్వహించారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.






