విషాదం.. ఇద్దరు గొర్రెల కాపరులు మృతి
కోనరావుపేట,(విజయక్రాంతి): కోనరావుపేట మండలం ధర్మారం గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కే. లక్ష్మీరాజం (58), కుమ్మం మొండయ్య (50) అనే ఇద్దరు గొర్రెల కాపరులు చెరువులో మునిగి మృతి చెందారు.వివరాల్లోకి వెళ్తే, ఈ ఇద్దరు తమ గొర్రెలను స్నానం చేయించేందుకు గ్రామ సమీపంలోని చెరువుకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా కొన్ని గొర్రెలు లోతైన నీటిలోకి వెళ్లడంతో, వాటిని బయటకు తీసేందుకు వారు చెరువులోకి దిగారు.
అయితే అనుకోకుండా లోతైన ప్రాంతంలోకి వెళ్లి అదుపుతప్పి మునిగిపోయారు.ఈ ఘటనతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. అనంతరం ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు.చెరువు వద్దకు చేరుకున్న ఎస్ఐ ప్రశాంత్ రెడ్డి ఘటన స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.గ్రామస్తులు ఇద్దరి మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.




