20 May, 2026 | 1:23 AM

గిరిజన చట్టాలకు తూట్లు!

20-05-2026 12:00 AM
  1. నాలా పర్మిషన్ లేకుండానే బట్టీల జోరు
  2. ఏజెన్సీలో గిరిజనేతుల వ్యాపారం 
  3. నాలా కన్వెన్షన్ ఇవ్వలేదు 

భద్రాద్రి కొత్తగూడెం, మే 19, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవి పల్లి మండలం లో గిరిజన చట్టాలను తుంగలో తొక్కి గిరిజనేతరులు బేషరతుగా ఇటుకల వ్యాపారం సాగిస్తున్నారు. మండల పరిధిలో అంబసత్రం భూములతో పాటు, కొన్ని సాగు భూములు, చెరువు శిఖం భూముల్లో  ఇటుక బట్టీల వ్యాపారం సాగుతోంది. గిరిజన ప్రాంతంలో గిరిజనేతరులు బట్టిల వ్యాపారం చేయటం గిరిజన చట్టాలను అతిక్రమించినట్లే.

పట్టా భూముల్లో ఇటుకల వ్యాపారం నిర్వహించాలంటే తప్పనిసరిగా రెవెన్యూ శాఖ నుంచి నాలా పర్మిషన్ పొందాల్సి ఉంది. గిరిజన చట్టాలు అడ్డంకిగా మారడంతో గిరిజనేతరులకు  నాలా పర్మిషన్ రాదు. దీంతో నాలా పర్మిషన్ లేకుండానే అక్రమ ఇటుక వ్యాపారాన్ని సాగిస్తున్నారు . బహిరంగంగా చట్టాల అతిక్రమణ జరుగుతున్న సంబంధిత అధికారులు ఏమీ పట్టనట్టు వ్యవహరించటం కొసమెరుపు. లక్ష్మీదేవిపల్లి మండలం, కూనారం గ్రామ సమీపంలో రోడ్డుకు సమీపంలోనే ఇటుక బట్టీలు వ్యాపారం నిబంధనలకు విరుద్ధంగా సాగుతోంది.

రోడ్డు పక్కనే బట్టీలు ఉండడంవల్ల వాతావరణ కాలుష్యం ఏర్పడటంతో పాటు, బట్టీలు కాల్చినప్పుడు వెలువడే పొగకు వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులకు గురై ప్రమాదాలకు నిలయంగా మారింది. ఇటుక బట్టిలను నియంత్రించాల్సిన రెవెన్యూ, ఫారెస్ట్, కార్మిక శాఖ, మైనింగ్ శాఖలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం పట్ల స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారులు అక్రమ ఇటుక బట్టీల నియంత్రణపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఆగని అక్రమ ఇటుక బట్టీల వ్యాపారం 

బహిరంగంగా గిరిజన చట్టాలను, నిబంధనలను అతిక్రమించి అక్రమంగా ఇటుకల వ్యాపారం సాగుతోంది. ఆయన నియంత్రించాల్సిన ప్రభుత్వ శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం పై అనేక ఆరోపణలు వెలబడుతున్నాయి. ఇటుక వ్యాపారుల నుంచి ప్రభుత్వ శాఖ అధికారులకు భారీ మొత్తంలో నెల నెల నజరానా చేరవేయడం వల్లనే అధికారులు మొద్దు నిద్రలో ఉన్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో ఇటుకల వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది.

నాలా పర్మిషన్ ఇవ్వలేదు 

లక్ష్మీదేవిపల్లి మండలంలో జరుగుతున్న ఇటుక బట్టీల వ్యాపారం విషయమై లక్ష్మీదేవిపల్లి మండల రెవెన్యూ అధికారులను వివరణ కోరగా ఎక్కువ శాతం అంబసత్రం భూముల్లోనే వ్యాపారం సాగుతుంధని, కొన్ని సాగు పట్టా భూముల్లోనూ ఇటుక బట్టీల వ్యాపారం సాగుతోందని, వారు తప్పకుండా నాలా పర్మిషన్ తీసుకోవాల్సి ఉందని, రెవెన్యూ శాఖ నుంచి ఎవరికీ నాలా పర్మిషన్ ఇవ్వలేదని స్పష్టం చేశారు. భూమికి సంబంధించిన పట్టా పేపర్లను సమర్పించాలని ఎప్పటికీ పలుమార్లు ఆదేశించామ న్నారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామన్నారు