ఆదివాసి చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలి
ములకలపల్లి,ఆగస్టు 8 (విజయక్రాంతి): ఏజెన్సీ చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు గౌరీ నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం సంఘం ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ అనంతరం ఆయన మాట్లాడారు. ఇప్పటికీ ములకలపల్లి మండలంలో రోడ్డు సౌకర్యం లేని ఆదివాసి గ్రామాలు ఎన్నో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివాసిల సాగులో ఉన్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాల్సి ఉండగా పంటలు లేవనే సాకుతో వారిపై ఫారెస్ట్ అధికారులు దాడులు కొనసాగుతూనే ఉన్నాయని, 1/70 చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ఆదివాసి చట్టాలను అమలు చేయకపోతే ఐక్యంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమం లో నాయకులు కుంజా రామూర్తి, రాఘవయ్య, సర్పంచులు గంప సుజాత, వగ్గేల రాధ, గడ్డం వెంకటేశ్వర్లు, మల్లేష్, దినేష్, సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు.






