04-02-2026 12:00:00 AM
హైదరాబాద్, ఫిబ్రవరి1(విజయక్రాంతి) : ఎమ్మెల్యేల ఫిరాయింపు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకున్నది. స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి శాసన సభా స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ నోటీసు ఇచ్చారు. బుధవారం ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకావాలని నోటీసులో పేర్కొన్నారు. అదే విధంగా అనర్హత పిటిషన్ దాఖలు చేసిన కుత్బుల్లాపూర్ బీఆర్‌ఎస్ వివేకానంద కూడా విచారణకు హాజరుకావాలని నోటీసులు పంపారు. మొదట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వివేకానంద వాదనలు నమోదు చేయనున్నట్లు సమాచారం.
ఆ తర్వాత కడియం శ్రీహరి వాదనలు తీసుకోనున్నారు. కాగా, 2025 నవంబర్ 20న స్పీకర్ ప్రసాద్‌కుమార్ కడియం శ్రీహరితో పాటు దానం నాగేందర్‌కు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. తన నోటీసులకు తక్షణమే అఫిడవిట్ దాఖలు చేయాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. తనకు వచ్చిన నోటీసులపై సమాధానం ఇచ్చేందుకు మరి కొంత సమయం కావాలని స్పీకర్‌ను అభ్యర్థి లేఖ రాశారు. ఇదిలా ఉంటే పార్టీ మారినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న 10 మంది ఎమ్మెల్యేలకుగాను ఏడుగురు ఎమ్మెల్యేల విచారణ పూర్తి చేసిన స్పీకర్..
వీరు పార్టీ మారినట్లుగా ఎలాంటి ఆధారాలు లేవని అనర్హతన పిటిషన్లు కొట్టి వేసిన విషయం తెలిసిందే. ఇటీవలనే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై వచ్చిన అనర్హత పిటిషన్లపైన స్పీకర్ విచారణ జరిపి.. తీర్పు పెండింగ్‌లో పెట్టారు. ఇప్పుడు కడియం పిటిషన్‌పై విచారణ తర్వాత తీర్పు ఎప్పుడు.. ఎలా ఉంటుందనేదానిపైన ఉత్కంఠగా మారింది.
దానం నాగేందర్ పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. ఇక కడియం శ్రీహరి కూతురు వరంగల్ పార్లమెంట్ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. ఆ సమయంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీ విజయం కోసం ప్రచారం నిర్వహించారు. వీరిద్దరి ఎమ్మెల్యేల ఆధారాలను బీఆర్‌ఎస్ పార్టీ స్పీకర్ అందసినట్లుగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు చెబుతున్నారు.