10 March, 2026 | 2:09 AM

విద్యార్థులకు భోజన సదుపాయం కల్పించిన వ్యక్తికి

10-03-2026 12:37 AM

ఓ కళాశాల యజమాన్యం రూ.25 లక్షలు కుచ్చుటోపీ 

కళాశాల గేటు ముందు బాధితుల ధర్నా

ఘట్ కేసర్, మార్చి 9 (విజయక్రాంతి): నమ్మకంతో వెళ్తే నట్టేట ముంచారు. కష్టపడి పని చేస్తే కన్నీళ్లే మిగిల్చారు. వందల మంది విద్యార్థులకు ఆకలి తీర్చిన అచ్యుంతరావుకు ఓ ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం నిలువునా ముంచేసింది. సుమారు 18 నెలల పాటు సెక్యూరిటీ డిపాజిట్ పేరుతో లక్షలాది రూపాయలు కట్ చేసి, ఇప్పుడు అడిగితే బౌన్సర్లతో బయటకు గెంటేస్తున్నారంటూ బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

బాధితుడు తెలిపిన వివరాల్లోకి వెళితే మేడ్చల్ జిల్లా, ఘట్ కేసర్ సర్కిల్, 8వ డివిజన్ పోచారం పరిధి చౌదరిగూడలోని సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ పిలుపు మేరకు అచ్యుతరావు సుమారు 250 మంది విద్యార్థులకు మూడు పూటలా భోజన సదుపాయం కల్పించాలని చైర్మన్ హనుమంతరావు కోరారు. దీంతో అచ్యుంతరావు బాధ్యత తీసుకున్నాడు.

ప్రతినెలా వచ్చే బిల్లులో సెక్యూరిటీ డిపాజిట్ పేరుతో రూ. 35వేల నుండి లక్ష రూపాయల వరకు  కళాశాల యజమాన్యం కోత విధించినట్లు తెలిపారు. ఇలా దాదాపు 18 నెలల పాటు భారీ మొత్తంలో డబ్బులు ఆపుకొని, తీరా అడిగితే వాయిదాలు వేస్తూ కాలక్షేపం చేశారని బాధితుడు వాపోయారు.

తనకు రావాల్సిన రూ. 25 లక్షల డబ్బులు ఇవ్వాలని మేనేజ్మెంట్ను కలవడానికి వెళ్తే, బౌన్సర్లను పెట్టి గేటు బయటకు నెట్టివేస్తున్నారని బాధితుడు అచ్యుంతరావు  ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే సెటిల్ చేశామని మేనేజ్మెంట్ అబద్ధాలు చెబుతోందని, మేనేజ్మెంట్ తనకు ఇచ్చిందెంత? ఇవ్వాల్సిందేంత, అంతా తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని, ప్రభుత్వ అధికారులు తనకు న్యాయం చేయాలని అచ్యుంతరావు కోరుతున్నాడు.