10 March, 2026 | 2:07 AM

మహిళా సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది

10-03-2026 12:37 AM

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

వేములవాడ, మార్చి 09,(విజయక్రాంతి): వేములవాడ అర్బన్ మండలంలో సోమవారం రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పర్యటించి మహిళా సంఘాల అభివృద్ధికి పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అనుపురం, మారుపాక, చీర్లవంచ, గుర్రవానిపల్లి,కొడుముంజ గ్రామాల్లో రూ.50 లక్షల వ్యయంతో ఐదు మహిళా సమైక్య సంఘ భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని తెలిపారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మహిళలు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.గతంలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి మహిళా సంఘాలకు పావలా వడ్డీ రుణాలు అందించి బలపరిచారని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం మహిళా సంఘాలపై ప్రత్యేక దృష్టి సారించి, మూడు సార్లు వారు చెల్లించిన వడ్డీని తిరిగి వారి ఖాతాల్లో జమ చేసిందన్నారు.మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహలక్ష్మి ద్వారా ఇందిరమ్మ ఇండ్లకు రూ.5 లక్షల సహాయం, రూ.500కే గ్యాస్ సిలిండర్ వంటి పథకాలు మహిళలకు ఉపశమనం కలిగిస్తున్నాయని తెలిపారు.