ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచండి
- జూన్ 2 నాటికి ఆ రెండు వంతెనలు పూర్తి కావాలి
జీహెచ్‌ఎంసీ కమిషనర్ కర్ణన్
హైదరాబాద్ సిటీ బ్యూరో, ఫిబ్రవరి 24 (విజయక్రాంతి): మహానగరంలో ట్రాఫిక్ కష్టాలను శాశ్వతంగా దూరం చేసేందుకు, మౌలిక సదుపాయాల కల్పనకు చేపట్టిన ఎస్‌ఆర్‌డీపీ, ఎస్‌ఎన్‌డీపీ, హెచ్-సిటీ ప్రాజెక్టుల పనులను మరింత వేగవంతం చేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో నగరంలోని అన్ని జోన్ల పరిధిలో కొనసాగుతున్న కీలక ప్రాజెక్టుల పురోగతిపై ఆయన ఉన్నతాధికారులతో సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించారు.
జోనల్ పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఒక్కో ప్రాజెక్టు తాజా పరిస్థితిని, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సవాళ్లను ఇంజనీరింగ్ అధికారులు కమిషనర్‌కు వివరించారు. పెండింగ్ పను లు, వాటి జాప్యానికి గల కారణాలను అడిగి తెలుసుకున్న కమిషనర్ ఆర్వీ కర్ణన్ ప్రాజెక్టుల వేగవంతానికి అధికారులకు దిశాని ర్దేశం చేశారు.ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయడానికి బల్దియా వద్ద ఎలాంటి నిధుల కొరత లేదని కమిషనర్ స్పష్టం చేశారు.
రోడ్ల విస్తరణ, ఫ్లుఓవర్ల నిర్మాణంలో ప్రధాన అడ్డంకిగా మారిన యుటిలిటీ షిఫ్టింగ్ విద్యుత్, నీటి పైపుల మార్పిడి, పెండింగ్ భూసేకరణ ప్రక్రియలను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. ముఖ్యంగా నగర వాసులకు ఎంతో కీలకమైన మూసారంబాగ్ హైలెవల్ బ్రిడ్జి, నల్గొండ ఎక్స్ రోడ్స్ ఫ్లుఓవర్ పనులను మిషన్ మోడ్లో చేపట్టి, ఎట్టి పరిస్థితుల్లోనూ జూన్ 2వ తేదీ నాటికి పూర్తి చేయాలని అధికారులకు కఠిన ఆదేశాలు, డెడ్‌లైన్ జారీ చేశారు.




