8 June, 2026 | 6:06 PM

మమతా బెనర్జీకి బిగ్‌షాక్‌.. ఎన్డీయేలోకి 20 ఎంపీలు!

08-06-2026 04:38 PM

కోల్‌కతా: పశ్చిమబెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి(Mamata Banerjee) మరో ఎదురుదెబ్బ తగిలింది. ఎన్డీయేతో(National Democratic Alliance) పొత్తు పెట్టుకోవాలనే తమ ఆకాంక్షను తెలియజేస్తూ 20 మంది టీఎంసీ ఎంపీలు(TMC MPs) లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు(Lok Sabha Speaker Om Birla) లేఖ రాశారని TMC ఎంపీ కాకోలి ఘోష్ దస్తీదార్ తెలిపారు. "బెంగాల్ ఎన్నికల తీర్పును మేము అంగీకరించాము. మా భవిష్యత్తు రాజకీయ ప్రస్థానం NDAతో కలిసి సాగాలని మేము భావిస్తున్నాము" అని ఘోష్ దస్తీదార్(Kakoli Ghosh Dastidar) పేర్కొన్నారు.

పార్టీ నాయకత్వంపై బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేసిన కొద్ది రోజులకే, ఘోష్ దస్తీదార్ గత నెలలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీలోని(Trinamool Congress Party) అన్ని సంస్థాగత పదవులకు రాజీనామా చేశారు. ఇటీవల పార్టీకి సంబంధించిన కీలక కార్యక్రమాలకు దూరంగా ఉంటూ, టీఎంసీ అంతర్గత పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆ ఎంపీ, పార్టీలోని తన బాధ్యతలన్నింటికీ రాజీనామా సమర్పించారు. అయితే, ఆమె ఎంపీగా మాత్రం కొనసాగుతున్నారు. ఇటీవల జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని ఢీకొట్టి బీజేపీ అధికారం దక్కించుకున్న విషయం తెలిసిందే. కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్‌ నివాసంలో బెంగాల్‌ ముఖ్యమంత్రి సువేందు అధికారితో టీఎంసీ ఎంపీలు సమావేశం అయ్యారు.  బీజేపీ ఎంపీ సీఎం రమేష్‌ ఆపరేషన్‌ బెంగాల్‌లో పాల్గొన్నారు.