21 August, 2026 | 2:07 AM

విద్యారంగాన్ని భ్రష్ఠు పట్టించారు!

21-08-2026 12:00 AM
  1. 12 వేల కోట్ల ఫీజు బకాయిలు చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటం
  2. కాంగ్రెస్ సర్కార్‌లో అన్ని రంగాలు నిర్వీర్యం
  3. బ్రిటిషర్లు స్థాపించిన కాంగ్రెస్‌కు వందేమాతరం పట్ల గౌరవం లేదు
  4. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
  5. కరీంనగర్‌లో ‘ఫీజుల బకాయి.. బీజేపీ లడాయి’
  6. తెలంగాణ చౌక్ నుంచి కలెక్టరేట్ వరకు విద్యార్థుల భారీ ర్యాలీ

కరీంనగర్/ముకరంపుర, ఆగస్టు 20 (విజయక్రాంతి): రాష్ట్రంలో విద్యారంగాన్ని భ్రష్ఠు పట్టించారని, 12 వేల కోట్ల ఫీజు బకాయిలు చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో కాంగ్రెస్ సర్కారు చెలగాటమాడుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు మండిపడ్డారు. కాంగ్రెస్ సర్కార్‌లో అన్ని రంగాలు నిర్వీర్యం అయ్యాయని విమర్శించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదల కోసం కరీంనగర్‌లో గురువారం బీజేపీ బీజేవైఎం విద్యార్థులు ఆందోళనకు దిగారు.

తెలంగాణ చౌక్ నుంచి కలెక్టరేట్ వరకు బీజేవైఎం నాయకులు, వందలాది మంది కళాశాల విద్యార్థులతో కలిసి భారీ ఎత్తున ‘స్టూడెంట్ మార్చ్’ నిర్వహించారు. కలెక్టరేట్ వద్ద చేపట్టిన  ఫీజుల బకాయి.. బీజేపీ లడాయి కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం యువ డిక్లరేషన్‌ను అటకెక్కించి, యువతను తీవ్రంగా మోసం చేసిందన్నారు. రాష్ర్టంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ వర్గాల విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు సుమారు రూ.12 వేల కోట్లు చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుందని మండిపడ్డారు.

దీనివల్ల లక్షలాది మంది విద్యార్థులు ఉన్నత చదువులు, ఉద్యోగ అవకాశాలు కోల్పోయి తీవ్ర గోస పడుతున్నారని తెలిపారు. “విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ అనేది ప్రభుత్వం ఇస్తున్న భిక్ష కాదు.. అది విద్యార్థుల హక్కు’ అని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాలనలో అన్ని రంగాలు నిర్వీర్యమయ్యాయని, ముఖ్యంగా రాష్ర్టంలో విద్యా రంగాన్ని ప్రభుత్వం పూర్తిగా భ్రష్టు పట్టించిందని మండిపడ్డారు.

పోలీసులు ప్రభుత్వానికి గులాములుగా పనిచేయవద్దని, శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులు, కళాశాల యాజమాన్యాలపై అంక్షలు పెట్టి ఆందోళనలను అడ్డుకోవాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని రాంచందర్‌రావు హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే స్పందించి రూ.12 వేల కోట్ల బకాయిలను విడుదల చేయాలని, లేనిపక్షంలో విద్యార్థుల పక్షాన బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళనలను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

బ్రిటిషర్లు స్థాపించిన కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీకి అధినేతగా వ్యవహరిస్తున్న విదేశీయురాలకు దేశం పట్ల, వందేమాతరం పట్ల   గౌరవం ఎప్పటికీ ఉండదని రాంచందర్‌రావు ఘాటుగా విమర్శించారు. అనంతరం బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు గణేష్ మాట్లాడుతూ.. స్టూడెంట్ మార్చ్ ప్రోగ్రాంకు సంబంధించిన విషయంలో పోలీసులు అతిగా ప్రవర్తించారని, విద్యార్థులు, కళాశాల యాజమాన్యాలను నోటీసులతో బెదిరించే ప్రయత్నం చేశారని ఆరోపించారు.

పోలీసులు ప్రభుత్వానికి తొత్తులా వ్యవహరిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని, తెలంగాణలో రాబోయేది బిజెపి ప్రభుత్వమేనని , పోలీసులు బాధ్యతగా పనిచేయాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం, నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ, రాష్ట్ర అధికార ప్రతినిధి, డిప్యూటీ మేయర్ యాదగిరి సునిల్ రావు, బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, బాస సత్యనారాయణ రావు, కరీంనగర్ పార్లమెంటు కన్వీనర్ బొయినిపల్లి ప్రవీణ్ రావు, జిల్లా నాయకులు గుజ్జ శ్రీనివాస్ రావు, బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరెడ్ల ప్రవీణ్‌రెడ్డి, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు సంగ నరేష్, బీజేవైఎం నాయకులు ఎడవెల్లి శశిధర్ రెడ్డి, చిక్కుల కిరణ్, నక్క ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు.