11 March, 2026 | 3:37 PM

సమాజంలో మహిళల పాత్ర కీలకం

11-03-2026 12:32 AM

- మహిళా ప్రజాప్రతినిధుల సన్మాన సభలో తెలంగాణ హైకోర్టు విశ్రాంత న్యాయ మూర్తి జస్టిస్ రజని

గజ్వేల్, మార్చి 10: సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో కీలకమని, రాజకీయంగా ముందడుగు వేసిన మహిళలు కుటుంబాన్ని మార్చిన విధంగానే సమాజ మార్పుకు కృషి చేయాలని తెలంగాణ హైకోర్టు విశ్రాంత న్యాయ మూర్తి జస్టిస్ రజని అన్నారు. గజ్వేల్ డివిజన్లో నూతనంగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులకు ప్రగతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో  ’సామాజిక గమనం - మహిళా ప్రజా ప్రతినిధుల పాత్ర’ అనే అంశంపై అవగాహన కల్పించడంతో పాటు వారిని దినంగా సన్మానించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన  తెలంగాణ హైకోర్టు విశ్రాంత న్యాయ మూర్తి జస్టిస్ రజని, రచయిత సజయ, వర్కింగ్ జర్నలిస్టుల సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఖాజా విరాహత్ అలీలు మహిళ ప్రజా ప్రతినిధులకు అవగాహన కల్పించారు.

సమాజాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమన్నారు. దేశ, రాష్ట్ర రాజకీయాల్లో, ఉద్యమాల్లో సైతం మహిళలు ముందంజలో నిలిచి విజయాలు సాధించారని, దేశంలో ఎన్నో గొప్ప మార్పులకు కారణమయ్యారన్నారు. రాజ్యాంగం కల్పించిన మహిళా రిజర్వేషన్లను మహిళల సద్వినియోగం చేసుకొని సాటి మహిళల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయంగా, సామాజికంగా ప్రజలకు ఉత్తమ సేవలందించి మహిళా నాయకత్వంపై నమ్మకాన్ని మరింత పెంచాలన్నారు.

మహిళా ప్రజాప్రతినిధులు గ్రామాలు, పట్టణాల్లో, వారి స్థాయిలో జరుగుతున్న విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఆయా అంశాలపై అవగాహన పెంపొందించుకోవడంతో పాటు వెంట వెంటనే స్పందిస్తూ సమస్యలను పరిష్కరించాలన్నారు. సొంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోగలిగే శక్తిని ప్రతి మహిళా ప్రజాప్రతినిధి పెంపొందించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ప్రగతి విద్యాసంస్థల ప్రతినిధులు అంబదాస్, మట్టయ్య చౌదరి, ఉపాధ్యాయ సంఘం నాయకులు మల్లికార్జున్, మహిళా ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.