రైల్వే అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి
*ఎంపీ కడియం కావ్య
వరంగల్, ఆగస్టు 5 (విజయక్రాంతి): వరంగల్ జిల్లాలో పెండింగ్ లో ఉన్న అభివృద్ధి, ఆర్వోబీ, ఆర్ యూ బీ పనుల్లో వేగం పెంచాలని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. పార్లమెంట్ సమావేశంలో ఆమె మాట్లాడుతూ వరంగల్ జిల్లాలో రైల్వే శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అభివృద్ధి కార్యక్రమాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
వరంగల్ జిల్లాలో రైల్వే లెవల్ క్రాసింగ్ల వద్ద ట్రాఫిక్ ఇబ్బందులు, ప్రమాదాల ముప్పు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో పెండింగ్లో ఉన్న ఆర్వోబీ, ఆర్ యూ బీ పనులను వేగవంతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా టెండర్ పూర్తయిన పనులు, జీ ఏ డీ దశలో ఉన్న ప్రాజెక్టులు ఆలస్యం కాకుండా నిర్దిష్ట గడువులో పూర్తి చేయాలని కేంద్ర రైల్వే శాఖను కోరారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మూడు ఆర్ యు బీ ల నిర్మాణానికి కూడా రైల్వే శాఖ పూర్తి సహకారం అందించాలని సూచించారు.
ఎంపీ కావ్య అడిగిన ప్రశ్నకు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఈమేరకు 2026 జూన్ 1 నాటికి వరంగల్ జిల్లాలో 3 రైల్వే ఓవర్ బ్రిడ్జిలు, 7 రైల్వే అండర్ బ్రిడ్జిలు, 8 లెవల్ క్రాసింగ్లు ఉన్నాయని, ప్రస్తుతం వరంగల్ జిల్లాలో 4 ఆర్ వో బీ, ఆర్ యు బి పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయని తెలిపారు.
వాటిలో వరంగల్ చింతలపల్లి మధ్య లెవల్ క్రాసింగ్ నెం.64 వద్ద రూ.77 కోట్లతో ఆర్ వో బీ నిర్మాణానికి టెండర్ ఖరారైందన్నారు. అలాగే కాజీపేట ,వరంగల్ మధ్య లెవల్ క్రాసింగ్ నెం.60, ఎల్గూర్‌నెక్కొండ మధ్య లెవల్ క్రాసింగ్ నెం.66, 67 వద్ద మరో మూడు ఆర్ వో బీ లను రాష్ట్ర ప్రభుత్వమే తన స్వంత నిధులతో చేపట్టినట్లు కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రంలో రూ.4,883 కోట్ల అంచనా వ్యయంతో 118 ఆర్ వో బీ, ఆర్ యు బీ పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నట్లు తెలిపారు.






