21 July, 2026 | 12:01 PM

ప్రజల సమస్యలకు తక్షణ పరిష్కారమే ప్రజాదివస్ లక్ష్యం

21-07-2026 01:49 AM

జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్

భూపాలపల్లి, జులై 20 (విజయ క్రాంతి): ప్రజల సమస్యల తక్షణ పరిష్కారమే ప్రజాదివాస్ లక్ష్యమని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజాదివాస్ కార్యక్రమంలో ఎస్పీ జిల్లా వ్యాప్తంగా వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి మొత్తం 13 ఫిర్యాదులు స్వీకరించి వారి సమస్యలు అడిగి తెలుసుకొని సంబంధిత పోలీస్ స్టేషన్ సీఐలు, ఎస్‌ఐలతో నేరుగా మాట్లాడి సమస్యల పరిష్కారానికి అవసరమైన సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలు ఎలాంటి పైరవీలు, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా నిర్భయంగా పోలీస్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. చట్టబద్ధమైన విధానంలో ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా పోలీస్ శాఖ కట్టుబడి ఉందని, ప్రజలకు మరింత చేరువగా ఉండి శాంతి భద్రతలను పరిరక్షించడం పోలీసుల ప్రధాన బాధ్యత అని తెలిపారు.