కోటి మంది మహిళలను..కోటీశ్వరులను చేయడమే లక్ష్యం
- పేదల సంక్షేమం, రైతు అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం
- మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇందిరమ్మ ఇండ్లతో ప్రతి అర్హుడికి గృహ కల్పన లక్ష్యం
- ప్రజల వద్దకే పాలన మా లక్ష్యం సాదా బైనమా, భూ సమస్యలకు త్వరితగతిన పరిష్కారం
నేలకొండపల్లి/కూసుమంచి, మే 6 (విజయక్రాంతి): కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలని లక్ష్యంగా, పేదల సంక్షేమం, రైతుల అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బుధవారం నేలకొండపల్లి మండలం గువ్వల గూడెం గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ప్రజాదర్బార్లో ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాంరెడ్డి, జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల దీవెనలతో ఏర్పడిన ప్రజాప్రభుత్వం గడచిన రెండు సంవత్సరాలలో పేద ప్రజలకు అండగా ఉంటూ, పేదల అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందని అన్నారు. రైతు సంక్షేమంలో ఎక్కడ తగ్గకుండా, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన చేయడంలో దేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే ముందున్నామని అన్నారు.
ప్రజలు తమ పనుల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి రాకుండా, ప్రభుత్వం ఏర్పడిన తొలి నాళ్లలోనే ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రజల వద్దకు పంపి ప్రజా పాలన దరఖాస్తులు స్వీకరించామని అన్నారు. దొరల పాలనలో లక్ష రూపాయల రుణమాఫీ చేయకుండా రైతులను మోసం చేస్తే, తమ ప్రభుత్వం ఏర్పడిన తొలి ఏడాదిలో 25 లక్షల మంది రైతులకు 21 వేల కోట్ల రూపాయల రెండు లక్షల వరకు రుణమాఫీ చేశామని, గత పాలకులు వరి వేస్తే ఉరి వేసినట్లే అని బెదిరిస్తే, తమ ప్రభుత్వం పూర్తి పంటను మద్దతు ధరతో కొనుగోలు చేయడంతో పాటు సన్న వడ్లకు క్వింటాల్కు 500 రూపాయలు చెల్లించామని అన్నారు.
అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ఇండ్లు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, మే నెలాఖరికి రెండవ విడత ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని అన్నారు. భూ భారతి ద్వారా భూ సమస్యలను పరిష్కరిస్తున్నామని, పెండింగ్లో ఉన్న సాదా బైనామా దరఖాస్తులను అర్హత మేరకు త్వరలో పరిష్కరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ఆర్డీఓ శ్రీనివాస్, తహసీల్దార్ రాంప్రసాద్, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ గ్రామాల సర్పంచులు, తదితరులు పాల్గొన్నారు.






