30 August, 2026 | 11:45 PM

Breaking News

ఇందిరమ్మ గృహ లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేత   •   సత్యనారాయణ గౌడ్‌ను పరామర్శించిన మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు   •   జెండాపై కవిరాజు పుస్తకావిష్కరణ   •   గరిడేపల్లి బస్టాండ్ లో మహిళలకు కనీస వసతులను ఏర్పాటు చేయాలి   •   ఎన్నికలు ఎప్పుడు వచ్చిన టిఆర్ఎస్ గెలుపుకాయం   •   కొండ పోచమ్మ ఆలయంకు సీసీ కెమెరా వితరణ   •   గిరిజన విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా జాదవ్ ప్రవీణ్ నాయక్   •   ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే విజయరమణ రావు   •   పాదయాత్రికుల దాహం తీర్చిన పిఎఆర్ టీమ్   •   కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన వైఫల్యమే లక్ష్యంగా బీఆర్ఎస్ పోరుబాట   •  

సామాన్యుల ప్రగతిరథం

03-06-2025 12:00 AM

దాదాపు రెండు శతాబ్దాల క్రితం 1817లో జర్మనీకి చెందిన బేరన్ కర్ల్‌వాన్ డ్రయిస్ చెక్కతో తయారుచేసిన ‘స్విఫ్ట్ వాకర్’ అనే ప్రయాణ సాధనమే తదనంతరం ఇనుము కడ్డీలు, రీమ్స్ రబ్బరు టైరు వంటి అలంకారాలతో నేడు మనం చూస్తున్న ఆధునిక సైకిల్‌గా రూపాంతరం చెందింది. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాల్లో అందరికీ అందుబాటులోకి వచ్చింది.

ముఖ్యంగా మన దేశంలో దాదాపు అన్ని ప్రాంతాల్లో, పల్లెటూళ్లలో నేటికీ సామాన్యులకు రవాణా సాధనంగా సైకిలే. ఒకప్పుడు సైకిల్ ఉందంటే ధనిక కుటుంబంగా భావించే పరిస్థితి. పల్లెటూరు నుంచి పట్టణాలకు వెళ్ళాలన్నా, కొత్తగా పెళ్లయిన జంటలు, భార్యాభర్తలు, అక్కా చెల్లెళ్ళు, అన్నాదమ్ములు, స్నేహితులు ఇలా ఎంతోమంది సరదాగా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళాలంటే సైకిల్ ఒక ప్రయాణ సాధనంగా శతాబ్దాలుగా మన ప్రయాణాలను సులభతరం చేస్తున్నది. అయితే, గత అర్ధ శతాబ్దంగా ఇది తన ప్రాభవాన్ని, ప్రాధాన్యాన్ని కోల్పోతున్నది.

దీనికి ప్రధాన కారణం ప్రజల ఆర్థిక స్థితిగతులు మెరుగు పడటమే. మొట్టమొదటి సారిగా పర్యావరణ పరిరక్షణ కోసం స్వీడన్ అంతర్జాతీయ స్థాయిలో ముందడుగు వేసింది. కార్లు, మోటార్ సైకిళ్ళు, పరిశ్రమలవల్ల వాతావరణ కాలుష్యం పెరుగుతోందని, వీటి నియంత్రణ కోసం పలు చర్యలు చేపట్టాలని ప్రజల్లో చైతన్యం కల్పిస్తూ, ఆ మేరకు ముఖ్యంగా సైకిల్ వాడకాన్ని పెంచే కార్యక్రమాలను నిపుణులు ప్రోత్సహిస్తున్నారు.

అంతర్జాతీయ స్థాయిలో ఐక్యరాజ్యసమితిపై ఒత్తిడి తెచ్చి ప్రతీ సంవత్సరం జూన్ 3న ‘అంతర్జాతీయ సైకిల్ దినోత్సవం’ జరిపేలా తీర్మానం చేసి 2018 నుంచి అమలు చేస్తున్నారు. నేడు సైకిల్ వాడకంలో ప్రపంచంలోనే ముందున్న దేశం నెదర్లాండ్స్. ప్రపంచవ్యాప్తంగా వాతావరణ కాలుష్యాన్ని నియంత్రించాలంటే సైకిల్ వాడకం ద్వారానే సాధ్యమని అన్ని దేశాలు గ్రహించాలి. చిన్నచిన్న దూరాలకు కూడా మోటార్ సైకిళ్ళు, కార్లు వినియోగించడం తగ్గించాలి.

నడవడం అనే భావన పెరగాలి. సైకిల్ తొక్కడం నామోషీగా భావించకూడదు. ఇకనైనా అందరూ మన ఆరోగ్యం కోసం, ఆనందం కోసం ప్రతీ ఒక్కరూ సైకిల్ తొక్కడం అలవాటుగా చేసుకోవాలి. పట్టణ ప్రాంతాల్లో సైకిల్ ట్రాక్‌లు విధిగా ఏర్పాటు చేయాలి. ఇప్పటికే బెంగళూరు, కాకినాడ, హైదరాబాద్, ట్రివేండ్రం వంటి నగరల్లో సైకిల్ ట్రాక్‌లు ఏర్పాటు చేశారు. సైక్లింగ్ ఒక ఫ్యాషన్‌గా మారాలి. అప్పుడే అనేక సమస్యలు పరిష్కారమవుతాయి. ఊబకాయం, డయాబెటిస్ వంటి అనారోగ్యాలు మటుమాయమవుతాయి. ‘మన ఆరోగ్యానికి మన సైకిల్’ అనే భావన పెంపొందాలి.  

 ఐ.ప్రసాదరావు