ఊరిస్తాందే సోకు ఉడుకుడుకు ఉగ్గాని..
వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న హారర్ కామెడీ చిత్రం ‘కొరియన్ కనకరాజు’. మేర్లపాక గాంధీ దర్శకుడు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్‌ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్నాయి. ఇందులో రితిక నాయక్ కథానాయిక కాగా, సత్య ముఖ్యపాత్రను పోషిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉన్న ఈ సినిమా నుంచి మేకర్స్ రెండో పాట ‘రాసగుమ్మడి’ని విడుదల చేశారు.
‘రాసాగుమ్మాడి పువ్వుల నా రాణి.. ఊరిస్తాందే సోకు ఉడుకుడుకు ఉగ్గాని.. జమ్మల్‌మడుగు జాణా.. తుమ్మీద కురుల దానా.. కత్తెర కండ్ల కూన అత్తరే పూసి పోనా.. నిను నంజుకోని తింటా ఆకొక్కా ఏసుకుంటా..’ అంటూ సాగుతోందీ గీతం. తమన్ స్వరపరిచిన ఈ పాటకు కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించగా, నల్గొండ గద్దర్ పాడారు. ఈ జానపదంలో వరుణ్‌తేజ్, దక్ష నాగర్కర్ మధ్య కెమిస్ట్రీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సినిమా ఆగస్టు 7న విడుదల కానుంది.






