2 September, 2026 | 7:43 PM

పుష్కరాల నాటికి ఆలయ పునర్నిర్మాణం పూర్తి చేయాలి

02-09-2026 | 07:20pm

నాణ్యత లోపం లేకుండా చూడాలి

అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి 

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ 

కాళేశ్వరుడి సన్నిధిలో కలెక్టర్ రాహుల్ శర్మ ప్రత్యేక పూజలు

భూపాలపల్లి/కాళేశ్వరం, సెప్టెంబర్ 02 (విజయ క్రాంతి): గోదావరి పుష్కరాల(Godavari Pushkarala)ను దృష్టిలో ఉంచుకొని కాళేశ్వరం శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి(Mukteeswara Swamy) ఆలయ అభివృద్ధి, పునర్నిర్మాణ పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ(Collector Rahul Sharma) అధికారులను ఆదేశించారు. బుధవారం కాళేశ్వరం దేవాలయాన్ని సందర్శించిన ఆయన.. ముందుగా శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆలయానికి చేరుకున్న కలెక్టర్‌కు అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం నూతనంగా నిర్మించిన బాలాలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. వేద పండితులు, అర్చకులు వేదాశీర్వచనం అందించగా, ఆలయ ఈఓ(EO) శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు.

అనంతరం ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న అభివృద్ధి, పునర్నిర్మాణ పనులను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆర్‌అండ్‌బీ, ఇరిగేషన్‌, దేవాలయ అధికారులు, సివిల్‌, స్టోన్‌ వర్క్‌ కాంట్రాక్టర్లతో పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. పుష్కరాల నాటికి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పనులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు.

ప్రతి నెలా పూర్తి చేయాల్సిన పనులకు స్పష్టమైన లక్ష్యాలు, కాలపరిమితి రూపొందించుకుని పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. శాఖల మధ్య సమన్వయంతో పనిచేస్తూ జాప్యాన్ని నివారించాలని, నిర్మాణ పనుల్లో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. నాణ్యమైన కృష్ణశిలలను వినియోగించి కార్వింగ్‌ పనులు చేపట్టాలని, రాతి పనులను వేగవంతం చేసేందుకు ముగ్గురు కాంట్రాక్టర్లతో పనులు కొనసాగించాలని సూచించారు. సివిల్‌ పనులను సైతం సమాంతరంగా వేగవంతం చేయాలని ఆదేశించారు.

ఆలయ పురాతన నిర్మాణాల పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ పునర్నిర్మాణ పనులు చేపట్టాలని, ఆలయ చారిత్రక ప్రాధాన్యత, నిర్మాణ నాణ్యత, భక్తుల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకొని పనులను పకడ్బందీగా పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు.ఈ

కార్యక్రమంలో ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ రమేష్, పీఆర్ ఈఈ విద్యాసాగర్, శిక్షణా డిప్యూటీ కలెక్టర్ నవీన్ రెడ్డి, ఆలయ ఈఓ మహేష్, ఉప ప్రధాన అర్చకులు ఫణీంద్ర శర్మ, వేద పండితులు, అర్చకులు, కాంట్రాక్టర్లు, ఇరిగేషన్‌, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.