ఆర్టీసీ సమ్మె— మరో సకల జనుల సమ్మెగా మారబోతోంది— ప్రభుత్వానికి ఆర్టీసీ జేఏసీ హెచ్చరిక
హైదరాబాద్: ఆర్టీసీ సమ్మె(Telangana RTC Strike) విషయమై ప్రభుత్వం నుంచి స్పందన లేదని జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న(RTC JAC Chairman Venkanna) వెల్లడించారు. సమ్మె నోటీసు ఇచ్చి 41 రోజులు గడుస్తున్న స్పందన రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం, యాజమాన్యం చర్చలు జరపకపోవడం విచారకరం అన్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన ప్రక్రియ ఇప్పటికీ మొదలు పెట్టలేదని తెలిపారు. ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించట్లేదని మండిపడ్డారు. ఎలక్ట్రిక్ బస్సులతో ఆర్టీ ఆస్తులను ప్రైవేటు పరం చేసే యోచన చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఆర్టీసీని హైదరాబాద్ లో లేకుండా చేయాలని చూస్తున్నారని, ఆర్టీసీ భూములను(RTC lands) ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసే యోచనలో ఉన్నట్లు వెంకన్న ఆరోపించారు. అద్దె బస్సుల నిర్వాహకుల సమస్యలు పరిష్కారించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆర్టీసీ ఔట్ సోర్సింగ్ సిబ్బంది కూడా సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆర్టీసీ సమ్మె.. మరో సకల జనుల సమ్మెగా మారబోతోందని హెచ్చరించారు. ప్రభుత్వం ఇప్పటికైనా సమ్మెపై జోక్యం చేసుకోవాలని, కాలయాపన కోసమే విలీన కమిటీ వేశారని జేఏసీ ఛైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
నష్టాల్లో ఉన్న మెట్రోను ప్రభుత్వపరం చేయాలని చూస్తున్నారని తెలిపారు. ఆర్టీసీని మాత్రం ప్రభుత్వం పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. తమ వెనక ఆర్టీసీ కార్మికులు తప్ప మరెవరూ లేరని జేఏసీ వెల్లడించింది. ఆర్థిక పరిస్థితి బాకాలేకపోతే మూసీ అభివృద్ధి ఎలా చేస్తున్నారు? అని జేఏసీ ఛైర్మన్ ప్రశ్నించారు. ఆర్టీసీని అన్యాక్రాంతం చేసే పరిస్థితి ఎందుకు వచ్చిందన్నారు. సమ్మెకు ఆర్టీసీ, ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి.






