చెరువులో అనుమానాస్పదంగా చేపల మృతి
నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్ బండ్, కేసరి సముద్రం చెరువులో(Kesari Samudram Cheruvu) గత వారం రోజులుగా చేపలు పెద్ద సంఖ్యలో మృతి చెందుతున్నాయి. మున్సిపాలిటీ నుంచి వెలువడుతున్న వ్యర్థాలు, మురుగునీరు చెరువులో కలవడంతో నీరు కలుషితమై చేపలు మృత్యువాత పడుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన దళారులు నిబంధనలకు విరుద్ధంగా చెరువులో చేపలను పట్టుకుని ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వలలకు చిన్న సైజు చేపలు సైతం చిక్కి మృతి చెందుతున్నాయని ఆరోపిస్తున్నారు. మృతి చెందిన చేపలు అలలతో ఎండబెట్ల గ్రామ శివారు వైపు కొట్టుకురావడంతో పరిసర ప్రాంతాల్లో తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది. చేపల మృతిపై అధికారులు వెంటనే విచారణ జరిపి, చెరువులో మురుగునీరు కలవకుండా చర్యలు తీసుకోవడంతో పాటు అక్రమ చేపల వేటను అరికట్టాలని స్థానిక మత్స్యకారులు కోరుతున్నారు.






