30 August, 2026 | 9:58 AM

రీ-సర్వే ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్ కుమార్ దీపక్

30-08-2026 08:50 AM

నస్పూర్, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లాలో భూ రీ-సర్వే ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం నస్పూర్ లో కలెక్టరేట్ లో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, సర్వే ల్యాండ్ రికార్డ్ ఎ.డి. శ్రీనివాస్ లతో కలిసి రెవెన్యూ సిబ్బందికి ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భూములకు సంబంధించి పాత రికార్డుల పైననే ఇప్పటికీ ఆధారపడి ఉన్నామని తెలిపారు. ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారం కోసం భూభారతి చట్టంను తీసుకువచ్చి రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరిగిందని, భూ సమస్యల శాశ్వత పరిష్కారంలో భాగంగా రీ-సర్వే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

జిల్లాలో 11 నాన్ కడస్టల్ గ్రామాలు, 70 కడస్టల్ గ్రామాలు మొత్తంగా 81 గ్రామాలు రీ -సర్వేకు ఎంపిక కావడం జరిగిందని, తెలంగాణ సర్వే & బౌండరీ చట్టం ప్రకారం రీ -సర్వే నిర్వహించడం జరుగుతుందని, చట్టం గురించి అవగాహన కలిగి ఉండి, క్షేత్రస్థాయిలో అమలు చేయాలని తెలిపారు. 8 నియంత్రణ దశలలో సర్వే జరుగుతుందని, చట్టబద్దత, సంబంధిత అంశాలపై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. గ్రామసభల ద్వారా పట్టదారులకు సమాచారం అందించాలని, మొదట గ్రామసభ నిర్వహించి సంబంధిత ప్రజలకు సమాచారం అందించి గ్రామ సరిహద్దును నిర్ణయించాలని, గ్రామ కంఠం, ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు, అటవీ సంబంధిత భూములను సాధారణ సర్వేయర్, రెవెన్యూ ఇన్స్పెక్టర్, జి.పి.ఓ.ల ఆధ్వర్యంలో గుర్తించాలని తెలిపారు. తదుపరి సర్వే బృందంతో పాటు రెవెన్యూ బృందాలు ఏర్పాటు చేసి సర్వే నిర్వహించడం, సర్వే సమయంలో ఖచ్చితంగా ఫీల్డ్ రిజిస్టర్ నిర్వహించాలని, తద్వారా క్లెయిమ్స్, అభ్యంతరాల పరిష్కరణ సులభతరం అవుతుందని తెలిపారు.

ప్రతి బృందం లక్ష్యానికి అనుగుణంగా సర్వే పనులను పూర్తి చేయాలని, అవసరమైన కార్యాచరణ రూపొందించాలని తెలిపారు. సర్వే, కొ-రిలేషన్ స్టేట్‌మెంట్ తయారీతో పాటు నోటీసుల జారీ ప్రక్రియను ఏకకాలంలో చేపట్టాలని, రైతులకు నోటీసులు సకాలంలో అందజేయాలని, రీ-సర్వే ప్రక్రియపై రైతులలో విస్తృత అవగాహన కల్పించాలని తెలిపారు. గ్రామాల హద్దుల నిర్ధారణకు సంబంధించిన సమాచారం సర్పంచులు, రైతులకు అందించాలని, రీ-సర్వే ప్రక్రియలో ప్రజల సహకారం తీసుకుని పారదర్శకంగా పనులను పూర్తి చేయాలని తెలిపారు. రీ-సర్వేకు సంబంధించి ఫారాలు అందుబాటులో ఉన్నాయని, నిబంధనల ప్రకారం సక్రమంగా పూర్తి చేసి రికార్డులను సిద్ధం చేయాలని సూచించారు.

రీ-సర్వే పనులపై తహసిల్దార్లు ప్రత్యేక చొరవ చూపి క్షేత్రస్థాయిలో పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు. జి.పి.ఓ.లు భూములకు సంబంధించిన రెవెన్యూ రికార్డులను సక్రమంగా సిద్ధం చేసి, రీ-సర్వేకు అవసరమైన సమాచారాన్ని అందుబాటులో ఉంచాలని తెలిపారు. భూముల రిజిస్ట్రేషన్ సమయంలో తహసిల్దార్ కార్యాలయాలలో సీలింగ్ డిక్లరేషన్‌ను పరిశీలించి, నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టాలని సూచించారు. భూభారతి దరఖాస్తులలో భూమి విస్తీర్ణానికి సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి, రికార్డులతో సరిపోల్చిన అనంతరం తదుపరి చర్యలు చేపట్టాలని తెలిపారు.