21 July, 2026 | 11:52 AM

ఎస్‌ఎల్‌ఎన్‌ఎస్ డిగ్రీ కాలేజీ వద్ద బస్సులు ఆపాలని విద్యార్థుల రాస్తారోకో

21-07-2026 01:34 AM

ఆలేరు, జూలై 20 : భువనగిరి ఎస్‌ఎల్‌ఎన్‌ఎస్ డిగ్రీ కళాశాల వద్ద ఆర్టీసీ బస్సులు ఆపాలని కోరుతూ విద్యార్థినీ, విద్యార్థులు సోమవారం రాస్తారోకో, ధర్నా చేశారు. ఆలేరు, యాదగిరిగుట్ట, రాజాపేట, మోత్కూర్, ఆత్మకూర్ మండలాల నుండి వందలాది మంది విద్యార్థులు ప్రతిరోజూ ఈ డిగ్రీ కళాశాలకు వస్తుంటారు.

కళాశాల వద్ద రిక్వెస్ట్ బస్ స్టాప్ ఉన్నప్పటికీ, బస్సులు ఆపడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. బస్సులు ఆపకపోవడంతో, ముఖ్యంగా విద్యార్థినులు తీవ్ర అవస్థలు పడుతున్నారని, కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ కళాశాలకు రావాల్సి వస్తోందని వారు తెలిపారు. రిక్వెస్ట్ స్టాప్ ఉండి కూడా బస్సులు ఆపకపోవడం దారుణమన్నారు. వెంటనే కళాశాల వద్ద అన్ని బస్సులు ఆపేలా చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని విద్యార్థులు హెచ్చరించారు.