ఉపాధ్యాయుల సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వానిది నిర్లక్ష్య వైఖరి
తపస్ ఉపాధ్యాయ సంఘం ధర్నాకు బీజేపీ సంపూర్ణ మద్దతు -- యాదగిరి సునీల్ రావు
ముకరంపుర,(విజయక్రాంతి): ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంతో వ్యవహరిస్తోందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కరీంనగర్ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు విమర్శించారు. కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట తపస్ (TPUS) ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాకు ఆయన హాజరై, బీజేపీ పక్షాన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
భావి భారత పౌరులను తీర్చిదిద్దే గురువులు తమ సమస్యల సాధన కోసం రోడ్డెక్కి ధర్నా చేయాల్సిన పరిస్థితి రావడం శోచనీయమని ఈ పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వం ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. ఉపాధ్యాయులకు సంబంధించిన 6 పెండింగ్ డీఏ లు, పీఆర్సీ తదితర కీలక సమస్యల పట్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలాంటి దృష్టి సారించడం లేదన్నారు. ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని ప్రజా, ఉద్యోగ సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని సూచించారు.ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఉపాధ్యాయులు చేసే ఈ పోరాటానికి బీజేపీ పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని యాదగిరి సునీల్ రావు స్పష్టం చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో తపస్ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు తిరుపతి రావు,ప్రభాకర్ రావు, తపస్ ఉపాధ్యాయ సంఘం పెద్దలు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.






