15 August, 2026 | 3:04 PM

స్వాతంత్య్ర స్ఫూర్తిని చాటిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు

15-08-2026 02:15 PM

దేశభక్తి, జాతీయ సమైక్యతకు ప్రాధాన్యతనిస్తూ స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొన్న శ్రీను బాబు

హైదరాబాద్‌, మంథని, ఆగస్టు 15విజయక్రాంతి: దేశభక్తి, జాతీయ సమైక్యతను చాటుతూ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. హైదరాబాద్‌ బీహెచ్‌ఈఎల్‌లోని అవధూత దత్త పీఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ కార్యసిద్ధి పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా శ్రీను బాబు మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాల ఫలితంగానే మనం స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నామని, వారి త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. దేశ అభివృద్ధి, ప్రజా సంక్షేమం, సామాజిక సమానత్వం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతతో పనిచేయాలని పిలుపునిచ్చారు.

ప్రజలతో మమేకమై, పార్టీ కార్యక్రమాలతో పాటు సామాజిక కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటున్న శ్రీను బాబు, స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించడం విశేషంగా నిలిచింది. పార్టీ శ్రేణులు, ప్రజలు, యువతలో దేశభక్తి స్ఫూర్తిని పెంపొందించేలా ఆయన సందేశం ఇచ్చారు.

అనంతరం ఆలయ కార్యవర్గం తరఫున ట్రస్టీ రాజవరం శచీంద్ర, ఆలయ మేనేజర్ వాసు, తదితర కార్యవర్గ సభ్యులు శ్రీను బాబుకు ఘన స్వాగతం పలికారు. ఆలయ నిర్వాహకులు ఆయనను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యవర్గ సభ్యులు, భక్తులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.