23 June, 2026 | 4:01 AM

లోక కళ్యాణార్థం శ్రీ పంచ వారాహి పూజా యాగ మహోత్సవం

23-06-2026 12:00 AM

దేవి కలెక్టివ్ చైర్ పర్సన్ డాక్టర్ నీలిమ వేముల

బంజారాహిల్స్, జూన్ 22 (విజయక్రాంతి): లోక కళ్యాణార్థం శ్రీ పంచ వారాహి పూజా యాగ మహోత్సవం 2026ను నిర్వహించామని దేవి కలెక్టివ్ చైర్ పర్సన్ డాక్టర్ నీలిమ వేముల తెలిపారు. ఆధ్యాత్మిక వాతావరణంలో ఎంతో శోభాయమానంగా యాగ మహోత్సవాన్ని సోమవారం నిర్వహించినట్లు తెలిపారు. ఈ విషయమై నీలిమ మాట్లాడుతూ శ్రీ జ్యోతిర్వాస్తు విద్యా పీఠం పీఠాధిపతి ఉమామహేశ్వర పండిత్ మార్గదర్శకత్వంలో ఉత్సవాన్ని నిర్వహించామన్నారు. 108 జంటలు మహా హోమంలో పాల్గొనగా 1800ల మంది భక్తులు ఏకకాలంలో మహాకలశ పూజ నిర్వహించారని తెలిపారు. 4500ల మందికి పైగా భక్తులు ఈ చారిత్రాత్మక ఉత్సవాల్లో భాగస్వాములయ్యారని వెల్లడించారు.

పంచ వారాహి అమ్మవారి దివ్య అనుగ్రహం ప్రజలందరిపై ఉండాలని, వారికి శాంతి, సమృద్ధి, రక్షణ, సకల శ్రేయస్సులు కలగాలని ఆకాంక్షించారు. దేవి కలెక్టివ్ అనేది ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, సాంస్కృతిక వారసత్వాన్ని, ఆధునిక నాయకత్వాన్ని సమ్మిళితం చేసే ఒక విశిష్టమైన ఉద్యమమని వివరించారు. అనంతరం పల్లవి నాగళ్ళ మాట్లాడుతూ నిజమైన స్త్రీ సాధికారత అంటే సంప్రదాయాలను కాపాడుతూ ఆధునిక అవకాశాలను అందిపుచ్చుకోవడం అన్నారు.

సేవాస్ఫూర్తి, కరుణ, ఆత్మవిశ్వాసంతో మహిళలు తమ జీవితంలో ముందుకు సాగేలా ప్రేరేపించడమే సంస్థ లక్ష్యమని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో దేవి కలెక్టివ్ గౌరవ చైర్ పర్సన్ శ్రీదేవి పలబట్ల, కీలక సభ్యులు శ్రీదేవి కొత్తమాసు, స్వప్న మొంబి, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే నవీన్ యాదవ్, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి, సేవా ఫౌండేషన్ ప్రతినిధి సుకృతి ఉపాధ్యాయ్ తదితరులు పాల్గొన్నారు.