12 August, 2026 | 1:33 AM

ఇకనుంచి స్మార్ట్ రేషన్ కార్డులు

12-08-2026 12:31 AM

ఈనెల 15న సంగారెడ్డిలో సీఎం చేతుల మీదుగా పంపిణీ

జిల్లాలకు చేరిన కొత్త రేషన్ కార్డులు

సంగారెడ్డి/పటాన్చెరు, ఆగస్టు 11 (విజయక్రాంతి): ప్రజాపంపిణీ వ్యవస్థలో పారదర్శకతతో పాటు అక్రమాలకు చెక్ పెట్టేలా ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి నిర్ణయించింది. ట్యాంపరింగ్ కు అవకాశం లేకుండా క్యూఆర్ కోడ్ తో డెబిట్, క్రెడిట్ కార్డుల మాదిరిగా కార్డులను ముద్రించింది. నెల క్రితమే కార్డులు జిల్లాకు చేరినా ప్రభుత్వం వాటి పంపిణీపై నిర్ణయం తీసుకోలేదు.

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈనెల 15న సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా సంగారెడ్డిలో వాటిని పంపిణీ చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో కార్డులను మండలాల వారీగా తరలించేందుకు పౌరసరఫరాల శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. జిల్లాలోని ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా లబ్దిదారులకు కార్డులు అందించనున్నారు. సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా దాదాపు 660 కి పైగా అధికారిక రేషన్ దుకాణాలు ఉన్నాయి. జిల్లాలో సుమారు 3.40 లక్షలకు పైగా క్రియాశీలక రేషన్ కార్డులు ఉన్నాయి. ఈ కార్డుల ద్వారా దాదాపు 10.50 లక్షల మందికి పైగా సభ్యులు ప్రతి నెల రేషన్ సరుకులను పొందుతున్నారు.

12ఏళ్ల తర్వాత కొత్త కార్డులు...

గతంలో దారిద్య్ర రేఖకు దిగువనున్నవారికి తెలుపు రంగు, దారిద్య్రరేఖకు ఎగువనున్న వారికి గులాబీ రంగు రేషన్ కార్డులుండేవి. వాటిపై సీఎం ఫొటోతో పాటు లబ్దిదారు ఫొటో, కుటుంబ సభ్యుల వివరాలు ముద్రించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నుంచి రేషన్ కార్డులు ముద్రించలేదు. నాటి టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజల స్థితిగతులను తెలుసుకునేందుకు సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించింది. దాని ఆధారంగా ఆన్లైన్లో కుటుంబ సభ్యుల వివరాలతో కూడిన ఆహారభద్రత ప్రతుల ఆధారంగా లబ్దిదారులకు రేషన్ పంపిణీ చేసింది.

రేషన్ దుకాణాల ద్వారా బియ్యం మాత్రమే అందిస్తుండడంతో ఏపీఎల్ (గులాబీ) కార్డులను పూర్తిగా రద్దు చేసింది. తాజాగా నూతన కార్డులు జారీ చేయాలని నిర్ణయించిన కాంగ్రెస్ ప్రభుత్వం ట్యాంపరింగ్కు అవకాశం లేని పీవీసీ స్మార్ట్ కార్డులు ముద్రించింది. అందులో కుటుంబ యజమాని ఫోటోతో పాటు కుటుంబ సభ్యుల వివరాలు పొందుపర్చారు. ఏటీఎం కార్డుల తరహాలో ఉన్న వీటిని పీవోఎస్ యంత్రాలపై స్కాన్ చేసి లబ్దిదారులకు బియ్యం పంపిణీ చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. క్యూ ఆర్ కోడ్ను స్కాన్ చేయడం ద్వారా కార్డుదారు కుటుంబ సభ్యుల సమాచారం కనిపించనుంది. 

కలెక్టర్లకు పంపిణీ బాధ్యతలు...

స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ బాధ్యతలను ప్రభుత్వం కలెక్టర్లకు అప్పగించింది. జిల్లా పౌరసర ఫరాలు, రెవెన్యూ, పోలీస్ శాఖల సమన్వయంతో లబ్దిదారులకు పకడ్బందీగా పంపిణీ చేయాలని ఆదేశించింది. ప్రభుత్వ తాజా ఆదేశాల నేపథ్యంలో జిల్లాకు చేరిన కార్డులను మండలాల వారీగా సరఫరా చేసేందుకు పౌరసరఫరాల శాఖ అధికారులు కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. కలెక్టర్ ఆదేశాలకు అనుగుణంగా వాటి పంపిణీపై చర్యలు చేపట్టనున్నారు.

పంద్రాగస్టు వేడుకలను పురస్కరించుకుని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా కార్డులు పంపిణీ చేయనున్నారు. వృద్దులు, దివ్యాంగులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలుకు రేషన్ కార్డే  ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ప్రభుత్వం ఏళ్ల నిరీక్షణ తర్వాత కార్డులు అందిస్తుండడంతో కొత్తగా కార్డు పొందనున్న లబ్దిదారుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. 

15న సీఎం చేతుల మీదుగా ప్రారంభం...

ఈనెల 15వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం సంగారెడ్డి పట్టణంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్తో పాటు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కలిసి సభ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు సైతం పాల్గొంటున్నారు.