ఆరుబయట నిద్ర.. దొంగలున్నారు జాగ్రత్త..!
మహబూబాబాద్, మే 17 (విజయక్రాంతి): ఎండలు మండిపోతుండడం.. రాత్రిపూట ఉక్కపోత తట్టుకోలేక ఇటీవల గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది ఆరుబయట నిద్రిస్తున్నారు. అయితే ఆదమరిచి నిద్రిస్తున్న మహిళల మెడలో బంగారు నగలను తస్కరించడానికి దొంగల ముఠా సంచరిస్తోంది. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం చీకటాయపాలెం గ్రామంలో ఒకేరోజు మూడు చోట్ల ఆరు బయట నిద్రిస్తున్న మహిళల మెడలో నుండి బంగారు నగరలను చైన్ స్నాచర్లు చాకచక్యంగా కొట్టేశారు.
నిద్రిస్తున్న మహిళలకు ఎలాంటి అలికిడి లేకుండా, బంగారు నగలను కొట్టేయడం విష్మయానికి గురి చేస్తోంది. తెల్లవారుజామున మెలకువ వచ్చి చూసుకునేంతవరకు కూడా వారి నగలు అపహారాలకు గురైన విషయాన్ని గుర్తించే అవకాశం లేకుండా దొంగలు దొంగతనానికి పాల్పడుతుండడం గమనార్హం. అలాగే పలు ప్రాంతాల్లో ఉదయం పూట వాకిలి ఊడ్చే సమయంలో కూడా మహిళల మెడలో నుండి బంగారు నగలను తస్కరించడం పరిపాటిగా మారింది. దొంగతనాలు ముందుగా రెక్కీ నిర్వహించి చేస్తున్నారా, లేదా అదను చూసి చేతివాటం ప్రదర్శిస్తున్నారా అన్నది ప్రశ్నార్ధకంగా మారింది. ఏది ఏమైనా వేసవికాలంలో దొంగతనాల సంఖ్య పెరుగుతుండడంతో, ఇందుకు తగ్గట్టుగా ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఆరుబయట నిద్రిస్తే ఎదురయ్యే ప్రమాదాలు సెల్ఫోన్, నగదు చోరీలు, చాలామంది మొబైల్ ఫోన్లు, పర్సులు, నగదు దిండ్ల పక్కన పెట్టుకుని నిద్రిస్తుంటారు. అర్ధరాత్రి వేళల్లో దొంగలు వీటిని ఎత్తుకెళ్లే ఘటనలు అధికమవుతున్నాయి. మహిళల బంగారు ఆభరణాల లక్ష్యం కొన్ని చోట్ల మహిళలు మెడలో గొలుసులు, చెవిపోగులు ధరించినట్టుగానే బయట నిద్రించడం వల్ల చైన్ స్నాచింగ్ ఘటనలు జరుగుతున్నాయి.
ద్విచక్ర వాహనాల దొంగతనాలు ఇళ్ల ముందు తాళాలు సరిగా వేయకుండా పార్క్ చేసిన బైక్లు, స్కూటీలు చోరీకి గురవుతున్నాయి.అనుమానాస్పద వ్యక్తుల సంచారం. రాత్రివేళల్లో కొత్త వ్యక్తులు తిరుగుతూ ఇళ్ల పరిస్థితులు గమనించి, అనంతరం చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తిస్తున్నారు.బయట నిద్రించే సమయంలో చిన్నారులు ఒంటరిగా దూరంగా వెళ్లిపోవడం, ప్రమాదాలకు గురయ్యే అవకాశమూ ఉంది.
ప్రజలు పాటించాల్సిన జాగ్రత్తలు
విలువైన నగదు, బంగారు ఆభరణాలు బయట ఉంచకూడదు. సెల్ఫోన్లు, పర్సులు తల దగ్గర కాకుండా భద్రమైన చోట పెట్టుకోవాలి.
ఇంటి తలుపులు, కిటికీలు సరిగా లాక్ చేయాలి.వాహనాలకు డబుల్ లాక్ విధానం ఉపయోగించాలి.పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. ఒంటరిగా కాకుండా కుటుంబ సభ్యులతో కలిసి నిద్రించడం మంచిది.కాలనీలు, గ్రామాల్లో రాత్రి వేళల్లో పరస్పర నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలి. వీధి దీపాలు పనిచేయకపోతే స్థానిక అధికారులకు సమాచారం అందించాలి.
సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా చోరీలను నియంత్రించవచ్చు..
పోలీసుల సూచనలు భద్రతపై ప్రత్యేక దృష్టి
వేసవికాలంలో రాత్రి పహారాలను మరింత పెంచినట్లు పోలీసులు చెబుతున్నారు. ముఖ్యంగా కాలనీలు, బస్తీలు, గ్రామాల్లో బీట్ కానిస్టేబుళ్ల ద్వారా నిరంతర గస్తీ నిర్వహిస్తున్నట్లు పేర్కొంటున్నారు. రాత్రి వేళల్లో అపరిచితులపై నిఘా పెట్టాలి అత్యవసర సహాయం కోసం డయల్ 100 లేదా స్థానిక పోలీస్ స్టేషన్ను సంప్రదించాలి. సామాజిక మాధ్యమాల్లో ప్రయాణాలు, ఇంట్లో లేని సమాచారం బహిర్గతం చేయకూడదు.కాలనీల్లో వాట్సాప్ గ్రూపుల ద్వారా పరస్పర సమాచార వ్యవస్థ కలిగి ఉండాలి.రాత్రి పహారా కమిటీలు ఏర్పాటు చేసుకోవాలి.
‘అప్రమత్తతే అసలైన రక్షణ’
ప్రజల సహకారం లేకుండా చోరీలను పూర్తిగా అరికట్టడం సాధ్యం కాదని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. చిన్నపాటి నిర్లక్ష్యమే పెద్ద నష్టాలకు కారణమవుతుందని, ప్రతి ఒక్కరూ భద్రతపై బాధ్యతతో వ్యవహరించాలని సూచిస్తున్నారు. వేసవి వేళల్లో చల్లని గాలి కోసం బయట నిద్రించడం సహజమే అయినప్పటికీ, జాగ్రత్తలు పాటిస్తేనే ప్రశాంత నిద్ర సాధ్యమవుతుందని అధికారులు పేర్కొంటున్నారు.






