సత్తుపల్లి ఎమ్మార్వో కార్యాలయంలో భూ సర్వేపై ఖమ్మం కలెక్టర్ సమీక్ష
పాల్గొన్న ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్
కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్
రైతుల సమస్యల తక్షణ పరిష్కారానికి కలెక్టర్ ఆదేశం
సత్తుపల్లి,(విజయక్రాంతి): సత్తుపల్లి ఎమ్మార్వో కార్యాలయంలో ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర అధ్యక్షతన భూ సర్వే ప్రక్రియపై ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి శాసనసభ్యురాలు మట్టా రాగమయి దయానంద్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, ఐ.ఏ.ఎస్. ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మట్టా రాగమయి నియోజకవర్గంలోని రైతుల నుండి భూ సమస్యలు, సర్వే జాప్యం, పాస్ పుస్తకాలకు సంబంధించి తనకు వచ్చిన పలు ఫిర్యాదులను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.
రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా త్వరితగతిన పరిష్కరించాలని, ఏ ఒక్క రైతుకూ అన్యాయం జరగకుండా చూడాలని ఆమె కలెక్టర్ కి విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్ దివాకర మాట్లాడుతూ... భూ సర్వే ప్రక్రియను పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రైతుల నుంచి వచ్చిన దరఖాస్తులను ప్రాధాన్యతా క్రమంలో పరిశీలించి, వీలైనంత త్వరగా పరిష్కారం చూపాలని సంబంధిత రెవెన్యూ అధికారులకు సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో సత్తుపల్లి ఏఎంసీ చైర్మన్ దోమ ఆనంద్ బాబు, మున్సిపల్ వైస్ ఛైర్మన్ బొంతు సుమలత, స్థానిక రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.






